న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నోయిడా, గ్రేటర్ నోయిడా పరిధిలోని రైతులు పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం చేపట్టడంతో ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అన్నదాతలను అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేయడంతో ఢిల్లీ-నోయిడా సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
వాహనదారులే కాక సామాన్య ప్రజలు కూడా నానా అవస్థలు పడ్డారు. రైతుల ముట్టడి కార్యక్రమం దృష్ట్యా అవాంఛిత సంఘటనలు జరగకుండా ముందుచూపుతో అల్లర్లను నియంత్రించే వాహనాలతో పాటు జల ఫిరంగులను సైతం పోలీసులు సిద్ధం చేశారు. డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టి రైతులు ఒకే చోట గుమిగూడకుండా అడ్డుకున్నారు.
ప్లాట్లుగా అభివృద్ధి చేస్తామని నమ్మించి తమ నుంచి భూమిని సేకరించి స్థానిక ప్రభుత్వాలు మోసం చేశాయని, తగిన పరిహారం చెల్లించలేదని ఆరోపిస్తూ నోయిడా, గ్రేటర్ నోయిడా పరిధిలోని రైతులు గత కొంతకాలంగా ఆందోళన చేపడుతున్నారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే భారీ సంఖ్యలో కదిలిన రైతాంగాన్ని మహామాయ ఫ్లై ఓవర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.