న్యూఢిల్లీ: ప్రపంచంతోపాటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం మరింతగా అప్రమత్తమైంది. తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. ఆసుపత్రుల్లో అదనపు బెడ్లను ఏర్పాటు చేయడంతోపాటు ఆక్సిజన్, ఇతర వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొంది. హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని తెలిపింది. తేలికపాటి కరోనా లక్షణాలున్న వారి కోసం హోటల్స్‌ను వినియోగించుకోవాలని సూచించింది. జిల్లా, సబ్ జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని పేర్కొంది. దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో వైద్య మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పెరగవచ్చని హెచ్చరించింది. ఈ మేరకు పలు జాగ్రత్తలతో కూడిన లేఖను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసింది.
ప్రపంచంలో ప్రస్తుతం కోవిడ్-19 కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ తన లేఖలో పేర్కొన్నారు. వేరియంట్ ఆఫ్ కన్సర్న్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో, ప్రపంచం ప్రస్తుతం కోవిడ్-19 కేసుల్లో అత్యధిక పెరుగుదలను చూస్తున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో దేశంలో డిసెంబర్ 31న అత్యధికంగా 16,764 కేసులు నమోదైనట్లు చెప్పారు. గత 70 రోజుల్లో నమోదైన రోజువారీ కేసుల సంఖ్యలో ఇది గరిష్ఠమని పేర్కొన్నారు.
ఐరోపా, అమెరికాతోపాటు అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో గత కొన్ని వారాలుగా కొత్త కేసులు గణనీయంగా పెరిగినట్లు నివేదికల ద్వారా తెలుస్తున్నదని రాజేష్ భూషణ్ తెలిపారు. మరోసారి వైరస్ అధిక వ్యాప్తిని ఇది సూచిస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కరోనా తొలి, రెండో వేవ్‌ను ఎదుర్కొన్న మాదిరిగా ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ ద్వారా సూచించారు.