Nizam’s Jewels : నిజాం నగలు (Nizam’s Jewels) రిజర్వ్ బ్యాంక్ (RBI) వద్ద సురక్షితంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆ నగల చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ ప్రాముఖ్యతను గుర్తించి, అధిక భద్రత మధ్య వాటిని ఉంచామని పేర్కొన్నది. ఈ వివరాలను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాజ్యసభకు రాతపూర్వకంగా వెల్లడించారు.
నిజాం నగలను హైదరాబాద్లో ప్రజల సందర్శనకు ఉంచే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని షెకావత్ చెప్పారు. నిజాం పాలకులకు చెందిన 173 అద్భుతమైన ఆభరణాలు 1995 నుంచి ఆర్బీఐ వాల్ట్స్లోనే భద్రంగా ఉన్నాయని ప్రభుత్వానికి తెలుసా..? అని కొందరు సభ్యులు మంత్రిని ప్రశ్నించారు. దీనికి ఆయన తెలుసని బదులిచ్చారు.