Serial Killer | న్యూఢిల్లీ, ఆగస్టు 8: యూపీలోని బరేలీ జిల్లా గ్రామీణ ప్రాంతంలో గత 14 నెలల్లో తొమ్మిది మంది మహిళలు ఒకే తరహాలో హత్యకు గురి కావడం పోలీసులకు సవాల్‌గా మారింది. 25 కి.మీ పరిధిలో ఈ హత్యలు జరగడం గ్రామస్థుల్ని ఆందోళనకు గురి చేస్తున్నది. మృతులంతా 45-55 ఏండ్ల వయస్కులని, అందరినీ పొలాల్లో గొంతు నులిమి చంపారని.. వారి దుస్తులు చిందరవందరగా పడి ఉన్నాయని పోలీసులు తెలిపారు. అయితే వారిపై లైంగిక దాడి జరిపిన దాఖలాలేవీ కనిపించలేదన్నారు.
సీరియల్ కిల్లర్ ఈ హత్యలకు పాల్పడి ఉండొచ్చన్న విషయాన్ని కొట్టి పారేయలేమని యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. 90 గ్రామాల రైతుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ముగ్గురు నిందితుల ఊహా చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. కేసును ఛేదించడం కోసం ఇటీవల బెయిల్ లేదా జైలు నుంచి విడుదలైన వారి వివరాలను సీనియర్ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.