న్యూఢిల్లీ: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఎనిమిది నెలల చిన్నారిని ఓ సిపాయి మృత్యువు కౌగిలి నుంచి కాపాడారు. డిబ్రూగఢ్ వెళ్తున్న రైల్లో ఎస్4 బోగీలో సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఈ సంఘటన జరిగింది. చిన్నారి ఊపిరి అకస్మాత్తుగా ఆగిపోవడంతో తల్లి స్పృహ కోల్పోగా, ఇతర ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో ఆ రైలులో ప్రయాణిస్తున్న సిపాయి (అంబులెన్స్ అసిస్టెంట్) సునీల్ తక్షణం స్పందించి చిన్నారి పరిస్థితిని పరిశీలించారు.
చిన్నారి నాడి కొట్టుకోవడం లేదని, ఊపిరి ఆడటం లేదని గుర్తించి ఆ బిడ్డను సమతల ప్రదేశంపై పడుకోబెట్టి పీడియాట్రిక్ కార్డియో-పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్)ను 2-ఫింగర్ చెస్ట్ కంప్రెషన్ టెక్నిక్‌ను ఉపయోగించి చేశారు. దాంతోపాటు నోటితోనూ రిససిటేషన్ చేశారు. రెండుసార్లు సీపీఆర్ చేసిన తర్వాత ఆ చిన్నారి ప్రాణాలతో ఉన్నట్లు సంకేతాలు కనిపించాయి. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. సునీల్ రైలు సిబ్బందితో మాట్లాడి, ఆ చిన్నారికి రంగియా స్టేషన్లో తదుపరి వైద్య సేవలందేలా చేశారు.