భోపాల్, అక్టోబర్ 29: వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఏర్పాటుచేసిన ‘ఇండియా’ కూటమిలో ఐక్యత కొరవడింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలు వేటికవే సొంతంగా బరిలోకి దిగుతున్నాయి. కాంగ్రెస్‌కు పొత్తు కుదరక సమాజ్‌వాదీ పార్టీ, జేడీయూ, ఆప్ సొంతంగా పోటీచేస్తున్నాయి. దీంతో కూటమి పార్టీలతో కాంగ్రెస్‌కు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో ఇండియా కూటమి పార్టీలైన ఆప్, సమాజ్‌వాదీపార్టీ, జేడీయూ 92 సీట్లలో బరిలోకి దిగుతున్నాయి. ఇండియా కూటమి పొత్తు కేవలం పార్లమెంట్ ఎన్నికలకే తప్ప అసెంబ్లీ ఎన్నికలకు కాదంటూ కాంగ్రెస్ చేసిన ప్రకటన ఇప్పుడు ఆ పార్టీ మెడకు చుట్టుకుంటున్నది.