ముంబై: సుమారు 50 ఏండ్లుగా సాగుతూ వస్తున్న రూ.7.65 చోరీ కేసుకు ముంబై కోర్టు మేజిస్ట్రేట్ తెరదించారు. 1977 నాటి ఈ కేసులో ఇద్దరు నిందితులు, ఫిర్యాదుదారుడు చాలా ఏండ్లుగా అదృశ్యమయ్యారు. పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ వారి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో కేసు 50 ఏండ్లుగా సాగుతూనే ఉంది. దశాబ్దాలుగా ఈ కేసు సాగుతున్న విషయాన్ని గమనించిన మజగావ్ మేజిస్ట్రేట్ ఆర్తి కులకర్ణి దానిని ఇంకా కొనసాగించడంతో అర్థం లేదని పేర్కొంటూ ఈ కేసును మూసివేయాలని ఈ నెల 14న ఆదేశించారు. ఈ కేసులోని ఇద్దరు నిందితులను నిర్దోషులుగా ప్రకటించారు. చోరీ మొత్తం రూ.7.65ను ఫిర్యాదుదారుకు అప్పగించాలని, ఒక వేళ ఆయన ఆచూకీ లభ్యం కాకపోతే ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలని ఆదేశించారు. పెండింగ్ కేసులపై దృష్టి సారిస్తున్న కోర్టులు చిరకాలంగా పెండింగ్లో ఉన్న చిన్న కేసులను మూసివేస్తున్నాయి.