లక్నో: సీనియర్ పోలీస్ అధికారి కూతురు హాస్టల్ గదిలో శవమై కనిపించింది. (Police Officer’s Daughter Found Dead) అపస్మారక స్థితిలో నేలపై పడి ఉన్న ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఆ యువతి అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. 19 ఏళ్ల అనికా రస్తోగి, రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీ విద్యార్థిని. ఎల్ఎల్బీ మూడవ సంవత్సరం చదువుతున్న ఆమె శనివారం రాత్రి హాస్టల్ రూమ్‌లో అచేతనంగా పడి ఉంది. వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆ యువతి అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
కాగా, అనికా గుండెపోటు వల్ల చనిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, దుస్తులు చెక్కుచెదరలేదని తెలిపారు. హాస్టల్ గది లోపలి నుంచి లాక్ వేసి ఉందని, అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని అన్నారు. అనికా మృతదేహానికి పోస్ట్‌మార్టం తర్వాత ఆమె మృతికి కారణం ఏమిటన్నది తెలుస్తుందని పోలీస్ అధికారి వెల్లడించారు.
మరోవైపు మృతురాలు అనికా తండ్రి, మహారాష్ట్ర కేడర్‌కు చెందిన 1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సంజయ్ రస్తోగి. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)లో ఇన్స్పెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. కుమార్తె మరణం విషయం తెలుసుకున్న ఆయన లక్నోకు బయలుదేరారు.