హైదరాబాద్, మే 30 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత శశి థరూర్ సహాయకుడు అరకిలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. రూ. 35 లక్షల విలువజేసే బంగారు గొలుసును బుధవారం ఇద్దరు నిందితులు తరలిస్తుండగా పట్టుకొన్నామని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని కస్టమ్స్ అధికారులు తెలిపారు. నిందితుల్లో ఒకరు శశిథరూర్ సహాయకుడు శివ ప్రసాద్‌గా గుర్తించినట్టు వెల్లడించారు.
ఈ ఘటనపై థరూర్ గురువారం ఎక్స్ వేదికగా స్పందించారు. ‘విషయం తెలిసి షాక్‌కి గురయ్యా. వయసు 72 ఏండ్లు. డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాడని తెలుసుకొని.. గతంలోనే రిటైర్మెంట్ తీసుకొన్నప్పటికీ, పార్ట్‌టైమ్ కింద అతన్ని విధుల్లోకి తీసుకొన్నా. అయితే, ఇలాంటి తప్పులను క్షమించబోను. దర్యాప్తు అధికారులకు అన్ని విధాలుగా సహకరిస్తా. ’ అని అన్నారు.