బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కి బీజేపీ సెగ పెడుతోంది. రాజ్యసభకు వెళ్లాలన్న ఆసక్తి తనకు ఉందని స్వయంగా సీఎం నితీశే ప్రకటించారు. ఇప్పుడు ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది. రాజ్యసభకు వెళ్లాలని తనకు ఆసక్తి వుందని సీఎం నితీశ్ సంచలన ప్రకటన చేశారు. ఇదే సరైన సందర్భం అనుకొని బీజేపీ వెంటనే పావులు కదపడం ప్రారంభించింది. నితీశ్ పెట్టిన ప్రతిపాదనను బీజేపీ గట్టిగా సమర్థిస్తుండటం గమనించాల్సిన అంశం.
సీఎం నితీశ్‌ను రాజ్యసభకు పంపించి, బిహార్ సీఎం పీఠంపై తమ అభ్యర్థిని కూర్చోబెట్టాలన్నది బీజేపీ ప్లాన్‌గా కనిపిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ఈ విషయంలో బిహార్ ప్రజలు సీఎం నితీశ్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని బీజేపీ భావిస్తోంది. దీంతో తమ అభ్యర్థిని సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని ఇప్పటికే సిద్ధమైపోయింది. అయితే సీఎం పీఠంపై తమ అభ్యర్థిని కూర్చోబెట్టి, జేడీయూకు రెండు డిప్యూటీ సీఎం పోస్టులు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. దళిత వర్గానికి చెందిన నేత లేదా ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేయాలని బీజేపీ ప్లాన్ వేసింది.
ముఖ్యమంత్రి రేసులో కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్
ఒకవేళ పరిస్థితులన్నీ అనుకూలిస్తే బిహార్ పీఠంపై బీజేపీ తన అభ్యర్థిని కూర్చోబెట్టాలని నిర్ణయించింది. అయితే.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ను బిహార్ సీఎంగా చేయాలని బీజేపీ నిర్ణయించింది.ఇక డిప్యూటీ సీఎంలుగా జేడీయూకు చెందిన లలన్ సింగ్, విజయ్ చౌధరి, శ్రవణ్ కుమార్.. ఈ ముగ్గురిలో ఎవరో ఇద్దర్ని డిప్యూటీ సీఎంలుగా చేయనున్నారు.