Piyush Goyal | న్యూఢిల్లీ: చైనాలో ఔత్సాహిక పారిశ్రామికులు ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ పరిజ్ఞానం, సెమికండక్టర్లు, కృత్రిమ మేథపై పనిచేస్తుండగా, భారత్‌లో అనేక స్టార్టప్‌లు సాంకేతిక పురోగతి వైపు కృషి చేయకుండా తక్కువ ఆదాయం వచ్చే చిల్లర వ్యాపారాలతోనే సంతృప్తి చెందుతాయా అంటూ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై సెమికండక్టర్ స్టార్టప్ ఫౌండర్ విజయ్ విఠల్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రం నిర్వహించిన అనేక సదస్సులకు తాను హాజరయ్యానని, మీ అవసరాలకు అనుగుణంగా చిప్‌లను అభివృద్ధి చేసే సామర్థ్యం తమకు ఉందని, ఎన్ని చిప్‌లను మీరు కొనుగోలు చేస్తారని ప్రశ్నించానన్నారు.
అయితే ‘మీరు ముందు తయారుచేయండి.. తర్వాత చూద్దాం’, ‘మేం కొనుగోలు చేయం.. వీటికి మార్కెట్ ఎక్కడ ఉందో మీరే వెతుక్కోండి’ అన్న సమాధానాలే వచ్చాయని ఆయన చెప్పారు. కొనుగోలుదారు, మార్కెట్‌లేని చోట ఏ స్టార్టప్ కూడా 10-20 కోట్లు, రెండేండ్ల సమయం వృథా చేయదన్నారు. అలాగే ‘పన్ను మినహాయింపులకు సంబంధించి మీ శాఖ నా దరఖాస్తును రెండేండ్లుగా తొక్కిపెట్టింది’ అని గోయల్‌కు ఆయన తెలిపారు. ఇండియా బయట మా పోటీ సంస్థలతో పోలిస్తే ఇక్కడి ట్యాక్స్‌ల కారణంగా దిగుమతులకు తాము రెండింతలు ఎక్కువ వ్యయం చేసినట్టు చెప్పారు.