న్యూఢిల్లీ, జూన్ 19: భారత సైన్యంలో అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ వేల మంది ఉద్యోగార్థులు రోడ్డెక్కారు. కానీ, ఈ స్కీంను కేంద్రం వెనకేసుకొస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నాయని చెప్తున్నది. మరి ‘అగ్నివీర్’లను అమెరికా, చైనా తదితర దేశాలు ఎలా రిక్రూట్ చేసుకొంటున్నాయి? దాని వల్ల అక్కడ సైనిక దళాలు సమర్థంగా పనిచేస్తున్నాయా? నిర్భంద సైనిక శిక్షణ ఏ స్థాయిలో అమలవుతున్నది. శిక్షణ తీసుకోకపోతే ఆయా దేశాలు తీసుకొనే చర్యలేమిటి? అని అమెరికాకు చెందిన ప్యూ రిసెర్చ్ సెంటర్ 191 దేశాల్లో మిలిటరీ వ్యవస్థపై అధ్యయనం చేసింది. ఆ దేశాల్లో 23 దేశాలు నిర్భంద సైనిక శిక్షణను తీసుకొచ్చినా, ప్రస్తుతం అమలవటం లేదు. 60 దేశాలు స్వచ్ఛంద సర్వీస్‌ను ఆహ్వానించాయి. అందులో 11 దేశాలు మహిళలను కూడా చేర్చుకొంటున్నాయి. 108 దేశాలు సైనిక దళాల కోసం అసలు చట్టాలనే రూపొందించలేదు.
భారత్‌లో శాశ్వత, తాత్కాలిక ప్రతిపాదిక
భారత్ శాశ్వత, తాత్కాలిక ప్రతిపాదికన సైనికులను రిక్రూట్ చేసుకొంటున్నది. శాశ్వత పద్ధతిలో తీసుకొనే దళాలకు యూపీఎస్సీ ద్వారా సీడీఎస్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. అర్హులైన వారికి పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో, డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో, గయాలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ ఇస్తారు. తాత్కాలిక ప్రతిపాదికన తీసుకొనేవారికి పదేండ్ల సర్వీస్ ఉంటుంది. తర్వాత వారిని ఆర్మీ పర్మినెంట్‌గా తీసుకోవచ్చు లేదా సైనికులే నాలుగేండ్ల పొడిగింపును ఎంచుకోవచ్చు. ఎలాంటి పెన్షన్, బెనిఫిట్స్ అందవు.
అమెరికాలో సెలెక్టివ్ సర్వీస్ సిస్టమ్
అమెరికా ఆర్మీలో సెలెక్టివ్ సర్వీస్ సిస్టమ్‌ను అనుసరిస్తున్నారు. 18-25 ఏండ్లున్న పురుషులంతా సైనిక శిక్షణకు రిజిస్టర్ చేసుకోవాలి. అవసరమైనప్పుడు విధులు నిర్వర్తించాలి. చాలా మంది నాలుగేండ్ల సర్వీస్ ఎంచుకొంటారు. ఆ తర్వాత ఫుల్టైమ్ను కోరవచ్చు. అర్హులకు 20 ఏండ్ల సర్వీస్ తర్వాత పింఛన్, బెనిఫిట్స్ ఉంటాయి.
చైనాలో నిర్భంద సైనిక విద్య
చైనాలో నిర్భందంగా సైన్యంలో చేరాల్సిందే. అక్కడ 18-22 ఏండ్ల వారు మిలిటరీ సర్వీస్‌ను ఎంచుకోవాలి. 24 నెలల సర్వీస్ చేయాలి. పూర్తికాలం సైనికులుగా పనిచేసిన వాళ్లకు రిటైర్ అయ్యాక వ్యాపారాలు చేసుకోవటానికి డిస్కౌంట్‌తో రుణాలు, పన్ను రాయితీలు కల్పిస్తారు.
రష్యాలో రెండు విధానాలు
రష్యా ఆర్మీలో నిర్భంద సైనిక విద్య, కాంట్రాక్ట్ పద్ధతి ఉన్నది. 18-27 ఏండ్ల వారు 12 నెలల నిర్భంద సైనిక విద్యను అమలు చేస్తున్నది. కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకొనే సైనికులకు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇస్తుంది. వారి కాంట్రాక్ట్ ముగిశాక సైనిక విద్యాసంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తారు.
ఇజ్రాయెల్‌లో మహిళలకూ నిర్భంద సైనిక విద్య
ఇజ్రాయెల్‌లో మహిళలకు కూడా నిర్భంద సైనిక శిక్షణను అమలు చేస్తున్నారు. పురుషులు 32 నెలలు, మహిళలు 24 నెలలు సైనిక సేవ చేయాల్సిందే. ఆ తర్వాత మిలిటరీనే కెరీర్‌గా ఎంచుకొనేవాళ్లు పర్మినెంట్ సర్వీస్‌ను ఎంచుకోవచ్చు. జీతభత్యాలు, పింఛన్ అందుతాయి. దీర్ఘకాలిక కాంట్రాక్ట్ సైనికులకూ పింఛను అందుతుంది.
పాకిస్థాన్‌లో స్వచ్ఛంద వ్యవస్థే
యుద్ధ సమయంలో నిర్భంద సైనిక విధిని పాకిస్థాన్ రాజ్యాంగం అనుమతిస్తుంది. ఆర్మీలో చేరేందుకు సరిపడా యువత ఉండటంతో, నిర్భంద సైనిక విద్యను అమలు చేయలేదు.