PUBG Love Story | న్యూఢిల్లీ, జూలై 19: పబ్జీలో పుట్టిన ప్రేమ పేరుతో భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన సీమా హైదర్ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. పాకిస్థాన్ పౌరురాలైన సీమా హైదర్ భారత్లోకి ప్రవేశించేందుకు పక్కాగా ప్లాన్ వేసిందని, ఒక గ్రామీణ భారత మహిళగా వేషం వేసిందని, ఇందుకు మేకప్ నిపుణుల సాయం తీసుకొన్నదని నిఘా వర్గాలు వెల్లడించాయి. సరిహద్దుల్లో భద్రతా బలగాలు గుర్తించకుండా.. పిల్లలకు కూడా అదేవిధంగా డ్రెస్సింగ్ చేసిందని తెలిపాయి. ఈ విధమైన వేషధారణను మానవ అక్రమ రవాణా సమయంలో వినియోగిస్తారని పేర్కొన్నాయి. సీమా హైదర్ ఇంగ్లిష్ భాష నైపుణ్యాన్ని కూడా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
ఇందుకు నేపాల్లోని పాక్ గ్రూపులు శిక్షణ ఇచ్చినట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. భారత్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేపట్టేందుకు నేపాల్ సరిహద్దు గుండా దేశంలోకి పంపే మహిళలకు ఈ విధంగా భాషపై శిక్షణ ఇస్తారని తెలిపాయి. సీమా హైదర్ ఈ ఏడాది మే 13న నేపాల్ సరిహద్దు గుండా భారత్లోకి ప్రవేశించిందని భద్రతా సంస్థలు చెబుతున్నాయి. అయితే దీన్ని సమర్థించేలా.. ఆ రోజున భారత్-నేపాల్ సరిహద్దులోని సునౌలి, సీతామర్హి సెక్టార్ల పరిధిలో మూడో దేశానికి చెందిన పౌరులు ఉన్నట్టు ఎటువంటి సమాచారం లేదని నిఘా వర్గాలు తెలిపాయి. సీమా హైదర్, ఆమె ప్రియుడు సచిన్ మీనా అందించిన సమాచారం మేరకు, దర్యాప్తు సంస్థలు సీసీటీవీ ఫుటేజ్, రికార్డులు, ప్రత్యేకంగా మే 13న సరిహద్దు వెంట బస్సు రూట్లను పరిశీలిస్తున్నారు.
భారత్లోకి ప్రవేశించే ముందు సీమా హైదర్, సచిన్ నేపాల్లోని కాఠ్మాండులో వారం పాటు హోటల్లో ఉన్నట్టు తెలుస్తున్నది. నకిలీ పేర్లతో 204 నంబర్ రూమ్ బుక్ చేసుకొని, అందులో రీల్స్ వీడియోలు తీసుకొన్నారని దర్యాప్తు వర్గాలు తెలిపాయి. మరోవైపు సీమా హైదర్.. పలువురు ఆర్మీ జవాన్లకు కూడా సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అధికారులు ఆమె సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం.