చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అతి పెద్ద వివాదానికి తెర తీశారు. కన్యాకుమారిలో ఈ నెల 22న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, “ఈ దేశ ప్రజలకు వ్యతిరేకంగా అనేక మోసాలు జరిగాయి. వాటిలో ఒకటి లౌకికవాదం గురించి తప్పుడు వివరణ ఇవ్వడం. లౌకికవాదం అంటే ఏమిటి? లౌకికవాదం అనేది యూరోపియన్ భావన. అది భారతీయ భావన కాదు” అని చెప్పారు. యూరోప్‌లో చర్చ్, రాజు మధ్య సంఘర్షణ కారణంగా లౌకికవాదం అనే భావన ఉత్పన్నమైందన్నారు.
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని రాసేటపుడు లౌకికవాదంపై చర్చను ఒకరు ప్రతిపాదించారని తెలిపారు. అప్పుడు, యావత్తు రాజ్యాంగ సభ స్పందిస్తూ, “మన దేశంలో లౌకికవాదమా? ఏదైనా సంఘర్షణ ఉందా? ధర్మం నుంచి భారత్ ఆవిర్భవించింది. ధర్మంలో సంఘర్షణ ఎలా ఉంటుంది?” అని ప్రశ్నించిందని గుర్తు చేశారు.
లౌకికవాదం అనేది యూరోపియన్ కాన్సెప్ట్ అని, అది అక్కడే ఉండాలని అన్నారు. మన దేశంలో లౌకికవాదం అవసరం లేదని స్పష్టం చేశారు. 1976లో మన రాజ్యాంగ ప్రవేశికలో ‘లౌకికవాదం’ను ప్రవేశపెట్టిన అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని రవి తీవ్రంగా విమర్శించారు. స్వాతంత్య్రానంతరం 25 ఏండ్ల తర్వాత, దేశంలో అత్యవసర పరిస్థితి సమయంలో, అభద్రతాభావం నిండిన ప్రధాన మంత్రి కొన్ని వర్గాల వారిని మచ్చిక చేసుకోవడం కోసం రాజ్యాంగంలో లౌకికవాదాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు.