శనివారం 28 నవంబర్ 2020
National - Nov 18, 2020 , 14:39:14

రెండోసారి విజ‌య‌వంతంగా‌ క్యూఆర్ఎస్ఏఎమ్ వ్య‌వ‌స్థ విమాన ప‌రీక్ష‌

రెండోసారి విజ‌య‌వంతంగా‌ క్యూఆర్ఎస్ఏఎమ్ వ్య‌వ‌స్థ విమాన ప‌రీక్ష‌

ఢిల్లీ :'క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్' (క్యూఆర్ఎస్ఏఎమ్) వ్య‌వ‌స్థ నిర్ధేశిత లక్ష్యాన్ని క‌చ్చితంగా ట్రాక్ చేసి, వాయుమార్గంలో లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఈ సిరీస్‌లో రెండోదైన విమాన పరీక్షను ఒడిశా తీరంలో ఛాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి1542 గంటలకు నిర్వ‌హించారు. బాన్షీ అని పిలిచే  అత్యుత్త‌మ‌మైన‌ పనితీరు గల మానవరహిత జెట్ విమానాన్ని ల‌క్ష్యంగా చేసుకొని మరోసారి ఈ ప‌రీక్ష నిర్వ‌హించ‌డం జరిగింది. రాడార్లు లక్ష్యాన్ని సుదూర శ్రేణి నుండే పొంది మిషన్ కంప్యూటర్ స్వయంచాలకంగా క్షిపణిని ప్రయోగించే వరకు మొత్తం ప‌ని తీరును ట్రాక్ చేసింది.

ఈ ప‌రీక్ష‌ల‌కు రాడార్ డేటా లింక్ ద్వారా నిరంతర మార్గదర్శకత్వం అందించారు. క్షిపణి టెర్మినల్ యాక్టివ్ హోమింగ్ మార్గదర్శకత్వంలో ప్రవేశించి వార్‌హెడ్ యాక్టివేషన్ సామీప్య ఆపరేషన్ కోసం లక్ష్యాన్ని చేరుకుంది. లాంచర్ పూర్తిగా ఆటోమేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, నిఘా వ్యవస్థ,మల్టీ ఫంక్షన్ రాడార్లతో కూడిన ఆయుధ వ్యవస్థ విస్తరణ ఆకృతీకరణలో ఈ విమాన పరీక్ష జరిగింది. క్యూఆర్ఎస్ఏఎమ్ ఆయుధ వ్యవస్థ చ‌ల‌న స్థితిలోనూ పనిచేయగలదు. ఇది దేశీయంగా అభివృద్ధి చెందిన ఉపవ్యవస్థలను కలిగి ఉంటుంది. ఈ ప‌రీక్ష‌తో వ్య‌వ‌స్థ‌ అన్ని లక్ష్యాలు పూర్తిగా నెరవేరిన‌ట్ట‌యింది.

ఈ వ్య‌వ‌స్థ‌ను వినియోగిస్తున్న భార‌త సైన్యం సమక్షంలో ఈ క్షిప‌ణి ప్రయోగం జరిగింది. ఈ ప‌రీక్షకు రాడార్, టెలిమెట్రీ ,ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్ల వంటి అనేక శ్రేణి పరికరాలను మోహరించారు. ఇవి పూర్తి విమాన డేటాను సంగ్రహించి మిస్సైల్‌ పనితీరును ధ్రువీకరించాయి. హైదరాబాద్, బాలసోర్‌కు చెందిన క్షిపణి కాంప్లెక్స్ లాబొరేటరీలతో పాటుగా పూణెకు చెందిన ఏఆర్‌డీఈ , ఆర్ అండ్ డీఈ(ఈ), బెంగ‌ళూరు మ‌హాన‌గ‌రానికి చెందిన ఎల్‌ఆర్‌డీఈ, డెహ్రాడూన్‌కు చెందిన ఐఆర్‌డీఈల‌కు చెందిన ప‌లు జట్లు ఈ మిస్సైల్‌ పరీక్షలో పాల్గొన్నాయి.

క్యూఆర్ఎస్ఏఎమ్ సిరీస్ పరీక్షలో మొదటిది ఈనెల‌13న ప్రత్యక్ష తాకి ,మైలురాయిని సాధించింది. రెండో పరీక్ష వార్‌హెడ్ పనితీరు నిరూపించింది. క్యూఆర్ఎస్ఏఎమ్ ప‌రీక్ష రెండోసారి విజయవంతంగా నిర్వ‌హించినందుకు ర‌క్ష‌ణ‌ మంత్రి రాజనాథ్ సింగ్ డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ ప‌రీక్ష‌ విజయ‌వంతం అయిన సంద‌ర్భంగా క్యూఆర్ఎస్ఏఎమ్ ప్రాజెక్టులో పనిచేసిన అన్ని జట్లను డీడీఆర్ అండ్ డీ కార్య‌ద‌ర్శి, ఛైర్మన్ డాక్టర్ జీ. సతీష్ రెడ్డి అభినందించారు.వ‌డోద‌రా మృతులకు ప్ర‌ధాన మంత్రి మోదీ సంతాపం..

 లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.