కొచ్చి, సెప్టెంబర్ 6: కొవిషీల్డ్ టీకా రెండో డోసును మొదటి డోసు వేసుకొన్న నాలుగువారాల తర్వాత ఎప్పుడైనా వేసుకొనేలా కొవిన్ పోర్టల్లో వెసులుబాటు కల్పించాలని కేరళ హైకోర్టు కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పుడు రెండు డోసుల మధ్య గడువు 84 రోజులుగా ఉన్నది. అయితే ఎవరైనా 84 రోజుల కంటే ముందే వ్యాక్సిన్ వేసుకోవాలనుకొంటే స్లాట్ బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం కల్పించాలని కేరళ హైకోర్టు సూచించింది. విదేశాలకు వెళ్లే వారికి రెండు డోసుల మధ్య గ్యాప్ తగ్గించినప్పుడు, ఇక్కడ ఉన్నవారికి ఎందుకు అలాంటి వెసులుబాటు ఉండకూడదని ప్రశ్నించింది. ఈ మేరకు ఈ నెల 3న కేంద్రాన్ని ఆదేశించగా సోమవారం ఆ ఉత్తర్వులు బయటకు వచ్చాయి. వ్యాక్సిన్ గడువుపై కిటెక్స్ గార్మెంట్స్ కేరళ హైకోర్టును ఆశ్రయించింది. కొవిషీల్డ్ డోసుల మధ్య గడువును తొలుత నాలుగు వారాలుగా కేంద్రం నిర్దేశించింది. అయితే వ్యాక్సిన్ డోసుల మధ్య గడువును పెంచితే మరింత సమర్థంగా పనిచేస్తాయని వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు సూచించడంతో 84 రోజులకు పెంచారు.