పాట్నా, అక్టోబర్ 15: అసెంబ్లీ ఎన్నికల కోసం సీట్లు ఖరారు చేసుకుని రెండు రోజులు కూడా కాకముందే బీహార్‌లోని అధికార ఎన్డీఏలో ముసలం ప్రారంభమైంది. చిన్న పార్టీలైన ఉపేంద్ర కుశ్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం), జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామీ మోర్చా (హెచ్ఏఎం)లు బాహాటంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఇక అధికార జేడీయూ పార్టీలో కూడా పలువురు నేతలు తమ నిరసనను తెలుపుతున్నారు.
ముఖ్యంగా గత ఎన్నికల్లో ఒక సీటు గెల్చుకున్న చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జన్‌శక్తి పార్టీ (రామ్ విలాస్ పాశ్వాన్)కి 29 సీట్లు కేటాయించడం పట్ల మండిపడుతున్నారు. ‘ఎన్డీఏలో ఏదీ బాగా లేదు’ అని రాజ్యసభ ఎంపీ కుశ్వాహ పేర్కొన్నారు. మొత్తం 243 సీట్లున్న బీహార్ అసెంబ్లీలో 2025 ఎన్నికలకు ఎన్డీఏ కూటమి సీట్ల పంపిణీ ఇలా ఉంది. బీజేపీ-101, జేడీ(యూ)-101, ఎల్జేపీ (రామ్ విలాస్)-29 సీట్లు, హెచ్ఏఎం (సెక్యులర్)-6, ఆర్ఎల్ఎం-6 సీట్లు.
చిరాగ్ పాశ్వాన్ పార్టీకి 29 సీట్లు కేటాయించడమేమిటని జేడీయూ నేతలు సీఎం నితీశ్ కుమార్‌పై కారాలు మిరియాలు నూరుతున్నారు. దీనిపై ఆగ్రహంతో భాగల్పూర్కు చెందిన జేడీయూ ఎంపీ అజయ్ కుమార్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు నితీశ్‌కుమార్‌కు లేఖ రాశారు. ఒక స్థానిక ఎంపీగా టికెట్ కేటాయింపులో తన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. అలాగే గోల్పూర్ ఎమ్మెల్యే గోపాల్ మండల్ కూడా జేడీ(యూ)కు రాజీనామా చేసినట్టు తెలిపారు.
పొత్తులో భాగంగా తమకు 29 సీట్లు కేటాయించడం సబబేనని, దానికి తాము అర్హులమని ఎల్జేపీ అధినాయకత్వం స్పష్టం చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ చూపిన సత్తా ఆధారంగా సీట్ల కేటాయింపు జరిగిందని పేర్కొంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఐదు స్థానాల్లో పోటీ చేసి అన్ని స్థానాలను గెల్చుకుంది. కాగా, పాశ్వాన్ పార్టీ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 135 సీట్లలో స్వతంత్రంగా పోటీ చేసి ఒక్క చోటే గెలిచింది.