న్యూఢిల్లీ: వారానికి 50 గంటలు మించి పని చేస్తున్నారా? అయితే అది మీ మెదడుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపి, మీ భావాల నియంత్రణ, జ్ఞాపక శక్తి కుచించుకుపోయే ప్రమాదముంది. దీర్ఘకాల పని గంటలు ముఖ్యంగా వారానికి 52 గంటలు మించి పనిచేస్తే అది మెదడు భౌతిక నిర్మాణాన్ని మార్చి వేస్తుందని ఒక కొత్త పరిశోధన వెల్లడించింది. దక్షిణ కొరియాలో నిర్వహించిన ఈ పరిశోధనలో పరిశోధకులు కొందరు ఆరోగ్య కార్యకర్తల మెదడు పరిమాణాన్ని ఎంఆర్ఐ స్కాన్ ద్వారా కొలిచారు. వీరిలో అధికంగా పనిచేసిన వారిలో నిర్ణయం తీసుకోవడం, జ్ఞాపకశక్తి, భావోద్వేగాల నియంత్రణకు బాధ్యత వహించే మెదడులోని ప్రాంతాల్లో గణనీయమైన మార్పులు సంభవించినట్టు గుర్తించారు.
పరిశోధన నిర్వహించిన చుంగ్-అంగ్, యూనస్ యూనివర్సిటీ పరిశోధకులు 32 మంది ఆరోగ్య కార్యకర్తలను నిర్దేశిత పని గంటల కన్నా ఎక్కువగా వారానికి 50 నుంచి 72 గంటల పాటు పని చేయించి వారి మెదళ్లను పరిశీలించారు. కార్య నిర్వాహక నైపుణ్యాలకు కీలకమైన మెదడు ఎడమ మధ్య ఫ్రంటల్ గైరస్ వాల్యూమ్‌లో 19 శాతం పెరుగుదలను కనుగొన్నారు. వోక్సెల్ ఆధారిత మోర్ఫోమెట్రీని ఉపయోగించి, ఇన్సులా, సుపీరియర్ ఫ్రంటర్ గైరస్తో సహా 17 మెదడు భాగాల్లో ఇలాంటి పెరుగుదలను పరిశోధకులు గుర్తించారు.
అయితే అధిక వాల్యూమ్ తొలుత సానుకూలంగా కన్పించినప్పటికీ అది దీర్ఘకాలిక ఒత్తిడికి మెదడు ప్రతిస్పందన కావచ్చునని నిపుణులు అంటున్నారు. ఇది తాత్కాలికంగా సామర్థ్యాన్ని పెంచవచ్చు. కానీ దీర్ఘకాలిక దుష్ప్రభావాలలో అలసట, భావోద్వేగ నియంత్రణ, జ్ఞాన సంబంధ సామర్థ్యాన్ని కూడా తగ్గించవచ్చు. ప్రస్తుతానికి ఈ అధ్యయనం చిన్న పరిణామ నమూనాకే పరిమితమైందని, భవిష్యత్తులో దీనిపై పెద్ద స్థాయిలో పరిశోధన అవసరమని పలువురు సూచిస్తున్నారు.