న్యూఢిల్లీ, నవంబర్ 5: మధుమేహ చికిత్సల్లో ఉపయోగపడే ఐఎల్-35 అనే నిర్దిష్ట ప్రొటీన్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. గువాహటిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ(ఐఏఎస్ఎస్టీ)కి చెందిన శాస్త్రవేత్తలు ఐఎల్-35 ప్రొటీన్‌ను టైప్ 1 మధుమేహం, మెల్లిటస్ మధుమేహ బాధితులకు కొత్త చికిత్సలు అందించేందుకు కీలకంగా మారనున్నట్టు తమ అధ్యయనంలో గుర్తించారు. ఈ వివరాలు సైటోకైన్, వరల్డ్ జర్నల్ ఆఫ్ డయాబెటిస్ జర్నళ్లలో ప్రచురితమయ్యాయి. ఐఎల్-35 అనేది ఐఎల్12ఏ, ఈబీఐ3 జన్యువులతో ఎన్కోడ్ చేసిన ఐఎల్-12 ఆల్ఫా, ఐఎల్-27 బీటా చైన్లకు చెందిన ప్రొటీన్.
ఇది శరీరంలో ఇన్ఫ్లమేటరీ రసాయనాలను ఉత్పత్తి చేసే కొన్ని రోగ నిరోధక కణాలను తగ్గించి రోగ నిరోధక వ్యవస్థను రక్షించడంలో ఉపయోగపడుతుందని, పాంక్రియాటిక్ కణాల ఇన్ఫిల్ట్రేషన్ను తగ్గించడంలో సాయపడుతుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. టైప్ 1 డయాబెటిస్, ఆటోఇమ్యూన్ డయాబెటిస్ మెల్లిటస్కు కొత్త చికిత్సలు అందించేందుకు ఐఎల్ 35 ప్రొటీన్‌ను ఉపయోగించవచ్చని ఐఏఎస్ఎస్టీ శాస్త్రవేత్తలు తెలిపారు.