న్యూఢిల్లీ: ‘ఆంత్రోపొసీన్’ అని పిలిచే ప్రతిపాదిత కొత్త యుగాన్ని ప్రతిబింబించే సరికొత్త భౌగోళిక ప్రదేశాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమి చరిత్ర అధికారిక కాలక్రమాన్ని మార్చే క్రమంలో ఇది తొలి అడుగు అని భావిస్తున్నారు. మానవ కార్యకలాపాలు ప్రపంచాన్ని ఎంతలా మార్చాయో చెప్పేందుకు ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు.
800 కోట్ల మంది ప్రజలు ఈ భూమిపై నివసిస్తూ ప్రభావం చూపుతున్నప్పుడు దాని ప్రతిఫలం కచ్చితంగా ఉంటుందని లీసెస్టర్ యూనివర్సిటీలోని జియోగ్రఫీ, జియాలజీ, ఎన్విరాన్మెంట్ స్కూల్ గౌరవ ప్రొఫెసర్, ఆంత్రోపొసీన్ వర్కింగ్ గ్రూప్ (ఏడబ్ల్యూజీ) చైర్మన్ కొలిన్ వాటర్స్ పేర్కొన్నారు. మనం ఈ కొత్త భూమి స్థితిలోకి మారామని, దానిని కొత్త భౌగోళిక యుగంగా నిర్వచించాలని కొలిన్ పేర్కొన్నారు. ఆంత్రోపొసీన్ యుగం దాదాపు 1950లోనే ప్రారంభమైందనిశాస్త్రవేత్తల బృందం నిర్ధారించింది.