న్యూఢిల్లీ : చత్వారంతో బాధపడే వారి కోసం ప్రత్యేక కంటి చుక్కల మందును శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ మందును వాడిన తర్వాత కంటి పరీక్షల చార్టులపై అదనపు లైన్లను చదవగలుగుతారు. ఈ మెరుగుదల రెండేళ్లపాటు నిలకడగా కొనసాగుతుంది. కోపెన్‌హాగన్‌లోని యూరోపియన్ సొసైటీ ఆఫ్ కేటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్స్‌కు ఈ అధ్యయన ఫలితాలను సమర్పించారు. 40 ఏళ్లు పైబడిన వారికి చత్వారం సాధారణమే. కంటి లెన్స్ మార్పులకు తగినట్లుగా మారే గుణం తగ్గిపోయినపుడు చత్వారం వస్తుంది. దీనినే ప్రెస్బయోపియా అంటారు. ఇది ఉన్నవారు దగ్గరలోని వస్తువులు, అక్షరాలను స్పష్టంగా చూడటం కష్టమవుతుంది. కంటి అద్దాలు లేదా శస్త్ర చికిత్స వల్ల ఈ సమస్య పరిష్కారమవుతుంది.
కళ్లజోడు ధరించడం న్యూసెన్స్ అని చాలా మంది భావిస్తారు. శస్త్ర చికిత్స చేయించుకునే స్తోమత అందరికీ ఉండదు. ఈ కొత్త కంటి చుక్కల మందు సరళమైన పరిష్కారాన్ని అందించే అవకాశం ఉంది. అధ్యయనంలో భాగంగా, పిలోకార్పైన్, డైక్లోఫెనాక్లతో కూడిన ఈ కంటి చుక్కల మందును 766 మంది రోజుకు రెండుసార్లు వినియోగించారు. వీరిని మూడు వర్గాలుగా విభజించారు. ప్రతి వర్గంలోని వారికి డైక్లోఫెనాక్‌ను నిర్దిష్ట మోతాదులోనూ, పిలోకార్పైన్ను వేర్వేరు మోతాదుల్లోనూ ఇచ్చారు. ఈ మందును వేసుకున్న ఒక గంట తర్వాత వీరు కంటి పరీక్షల చార్టులో చూడగలిగే లైన్ల సంఖ్య సగటున 3.45 లైన్లకు మెరుగుపడింది. ఈ మందు సురక్షితమైనదేనా? కాదా? నిర్ధారణ కావడం కోసం విస్తృత, దీర్ఘకాలిక, వేర్వేరు చోట్ల అధ్యయనాలు జరగవలసి ఉంటుందని నిపుణులు తెలిపారు.