త్రిస్సూర్, ఆగస్టు 11: ప్రముఖ అణు శాస్త్రవేత్త ఎంపీ పరమేశ్వరన్(91) మంగళవారం త్రిస్సూర్‌లో కన్నుమూశారు. శాస్త్రవేత్తగా, విజ్ఞానశాస్త్ర ప్రచారకుడిగా, రచయితగా..కేరళలో శాస్త్రీయ చైతన్యాన్ని పెంపొందించటంలో ప్రధాన పాత్ర వహించారు. ఆయన మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ, పరమేశ్వరన్ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన మృతి రాష్ట్రంలో సాంస్కృతిక, సామాజిక రంగాలకు తీరని లోటుగా మాజీ సీఎం పినరయ్ విజయన్ పేర్కొన్నారు. 1935 జనవరి 18న త్రిస్సూర్‌లో జన్మించిన ఆయన న్యూక్లియర్ ఇంజినీరింగ్‌లో పీహెచ్డీ చేశారు. ‘బార్క్’లో సైంటిస్ట్‌గా పనిచేశారు. కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ (కేఎస్‌ఎస్‌పీ) వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు. వృత్తిని వదిలి..సాధారణ ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని వ్యాప్తి చేసే లక్ష్యాన్ని ఎంచుకున్నారు. సామ్యవాద సమాజాన్ని ఊహిస్తూ రచించిన ‘ఫోర్త్ వరల్డ్’ సిద్ధాంతం రాష్ట్ర సీపీఎంలో తీవ్ర చర్చను రేపింది.