జైపూర్: వినాయక చవితికి సంబంధించిన ఒక పోస్ట్‌ను వాట్సాప్ గ్రూప్ నుంచి స్కూల్ ప్రిన్సిపాల్ డిలీట్ చేశాడు. రెండోసారి కూడా అతడు అలా చేయడంతో టీచర్లు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ స్కూల్ వద్ద నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో ముస్లిం అయిన ఆ స్కూల్ ప్రిన్సిపాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. (school principal arrested) రాజస్థాన్‌లోని కోటాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం కొందరు హిందూ టీచర్లు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వ స్కూల్ కమిటీ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశారు. అయితే మైనారిటీ వర్గానికి చెందిన స్కూల్ ప్రిన్సిపాల్ ముహమ్మద్ షఫీక్ తొలుత ఒక పోస్ట్‌ను డిలీట్ చేశాడు. రెండోసారి కూడా అతడు అలా చేయడంతో హిందువులైన కొందరు ఉపాధ్యాయులు, ఇతర సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులు, హిందూ సంఘాలతో కలిసి ఆ స్కూల్ వద్ద బైఠాయించి నిరసనకు దిగారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ స్కూల్ వద్దకు చేరుకున్నారు. హిందూ టీచర్లు, స్థానికుల ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. సామాజిక సామరస్యానికి విఘాతం కలిగించేందుకు ప్రయత్నించినందుకు స్కూల్ ప్రిన్సిపాల్ ముహమ్మద్ షఫీక్‌ను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో పోలీసులను మోహరించారు. గణేష్ ఫెస్టివల్ పోస్ట్‌లను వాట్సాప్ గ్రూప్ నుంచి పొరపాటున డిలీట్ చేసినట్లు మైనారిటీ స్కూల్ ప్రిన్సిపాల్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే అతడు రెండోసారి కూడా అలా చేయడంపై ఫిర్యాదు అందడంతో అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.