న్యూఢిల్లీ: పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్నది. బుధవారం తెల్లవారుజామున 1 గంట సమయంలో ‘ఆపరేషన్ సిందూర్’తో (Operation Sindoor) పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు, శిక్షణా కేంద్రాలను భారత యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. భారత్ దాడిలో సుమారు వంద మంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తున్నది. భారత వైమానిక దళంతో పాటు, నేవీ, ఆర్మీ కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.
కాగా, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద శిబిరాలు, శిక్షణ కేంద్రాలను ధ్వంసం చేసేందుకు భారత్ ఈసారి ఆత్యాధునిక రాఫెల్ ఫైటర్ జెట్స్‌ను వినియోగించింది. అలాగే పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాల ధ్వంసం కోసం స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులు, హామర్ అనే ప్రెసిషన్ గైడెడ్ బాంబులను వినియోగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదుల లక్ష్యాలను నాశం చేయడంతోపాటు పౌరుల ప్రాణనష్టాన్ని నివారించేందుకు ఈ ఆయుధాలు వాడినట్లు పేర్కొన్నాయి.
మరోవైపు స్టార్మ్ షాడో అని కూడా పిలిచే స్కాల్ప్, దీర్ఘ శ్రేణి క్రూయిజ్ క్షిపణి. దూరపు లక్షాల కోసం గాలి నుంచి ప్రయోగించే మిస్సైల్ ఇది. ప్రపంచ వ్యాప్తంగా రక్షణ దళాలు విరివిగా వినియోగిస్తాయి. రాత్రి వేళతోపాటు అన్ని సమయాలు, వాతావరణ పరిస్థితుల్లో వినియోగించవచ్చు. 450 కిలోమీటర్ల రేంజ్ కలిగిన స్కాల్ప్ క్షిపణిలోని నావిగేషన్ సిస్టమ్ ద్వారా ఖచ్చితత్వంతో టార్గెట్‌ను చేధిస్తుంది. బంకర్లు, మందుగుండు సామగ్రి నిల్వల్లోకి చొచ్చుకెళ్లి వాటిని ధ్వంసం చేస్తుంది. ఈ క్షిపణిని యూరోపియన్ కన్సార్టియం అయిన ఎంబీడీఏ తయారు చేసింది.
Scalp Missile
కాగా, ‘ఆపరేషన్ సిందూర్’లో భారత్ వినియోగించిన మరో ఆయుధం హామర్ (హైలీ అజైల్ మాడ్యులర్ మ్యూనిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్). ఇది ఎయిర్ టు గ్రౌండ్ బాంబ్. దీనిని గ్లైడ్ బాంబ్ అని కూడా పిలుస్తారు. గాలి నుంచి భూమి మీదకు ప్రయోగించే ప్రెసిషన్-గైడెడ్ మందుగుండు. 70 కిలోమీటర్ల రేంజ్ పరిధిలోని లక్ష్యాల కోసం దీనిని వినియోగిస్తారు. 250 కిలోల నుంచి వెయ్యి కిలోల బరువైన ఈ బాంబులను రాఫెల్‌కు ఈజీగా అమర్చవచ్చు.
Hammer
మరోవైపు ఫ్రెంచ్ కంపెనీ సఫ్రాన్ తయారు చేసిన హామర్ బాంబులను తక్కువ ఎత్తు నుంచి ప్రయోగించవచ్చు. బలమైన కాంక్రీట్ నిర్మాణాల్లోకి ఇవి చొచ్చుకెళ్లి ప్రభావితంగా ధ్వంసం చేస్తాయి. ఈ బాంబ్‌ను అడ్డుకోవడం చాలా కష్టం. పీవోకేలోని జైషే, లష్కర్ ప్రధాన కార్యాలయాలను హామర్ బాంబుల ద్వారా నేలమట్టం చేసినట్లు తెలుస్తున్నది.