Supreme Court | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. శరద్ పవార్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం అజిత్ పవార్ వర్గాన్ని ఉద్దేశించి.. మీ కాళ్లపై మీరు నిలబడడం నేర్చుకోండని చెప్పింది. ఎన్నికల్లో శరద్ పవార్ ఫొటోను ఉపయోగించొద్దని చెప్పింది. ఎందుకంటే రెండు పార్టీల మధ్య సైద్ధాంతిక విభేదాలున్నాయని చెప్పింది. శరద్ పవార్, అజిత్ పవార్ ఇద్దరూ కోర్టుకు వచ్చే బదులు ఎన్నికలపై దృష్టి సారించాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం పేర్కొంది. శరద్ పవార్ ఫొటోలు, పాత, కొత్త వీడియో క్లిప్‌లను ఎన్నికల్లో ఉపయోగించవద్దని తన కార్యకర్తలకు చెప్పాలని అజిత్ పవార్ తరఫు న్యాయవాది బల్వీర్ సింగ్‌కు సుప్రీంకోర్టు చెప్పింది.
ఈ కేసు విచారణ సందర్భంగా అజిత్ పవార్, శరద్ పవార్ మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్న ప్రజలు తెలివైన వారని బెంచ్ పేర్కొంది. కానీ, ఈ ఏఐ యుగంలో వారు సైతం మోసపోవచ్చని చెప్పింది. ఈ కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ విషయమై శరద్ పవార్ వర్గం తరఫున పిటిషన్ దాఖలైంది. ఇందులో సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ ఒకరు శరద్ పవార్ మద్దతు తెలిపే వీడియో క్లిప్‌ను వైరల్ చేశారన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి. 288 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరుగనున్నది. కాంగ్రెస్, శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)తో కూడిన ప్రతిపక్ష ఎంవీఏ కూటమి.. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, బీజేపీ, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో కూడిన మహాయుతి కూటమిని సవాల్ చేస్తూ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది.