న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరి ఘటనకు సంబంధించి యూపీ ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు సోమవారం మరోసారి ఆక్షేపించింది. యూపీ ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన తాజా నివేదిక (స్టేటస్ రిపోర్ట్)పై పెదవివిరిచింది. మరింత మంది సాక్షులను విచారించామని ప్రస్తావించడం మినహా ఈ నివేదికలో ఏమీ లేదని యూపీ సర్కార్‌పై సర్వోన్నత న్యాయస్ధానం అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ కేసు దర్యాప్తు నత్తనడకన సాగుతోందని గతంలోనూ సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. కాగా లఖింపూర్ ఖేరిలో ఆందోళన చేపట్టిన రైతులపైకి కేంద్ర మంత్రి కుమారుడికి చెందినదిగా భావిస్తున్న ఎస్యూవీ దూసుకెళ్లడంతో నలుగురు రైతులు మరణించగా, ఆపై జరిగిన అల్లర్లలో మరో నలుగురు మరణించడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.