న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: ప్రభుత్వరంగ సంస్థ హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సంస్థ ప్రైవేటీకరణకు ఆమోదం తెలపాలన్న నరేంద్రమోదీ సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ‘సబ్కా సహ్యోగ్ సొసైటీ’ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ వీ రామసుబ్రమణియన్‌తో కూడిన ధర్మాసనం కేంద్రంతో పాటు మరికొందరికి నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ ఒకటి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ సంస్థ.. గర్భనిరోధకాలు, మహిళల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఉత్పత్తులు, ఇతర ఔషధ ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. హెల్త్‌కేర్, డయాగ్నస్టిక్ సేవలు, కన్సల్టెన్సీ, కాంట్రాక్ట్ సర్వీసులు, వైద్యారోగ్య మౌలిక వసతులకు సంబంధించిన ప్రాజెక్టుల్లోనూ నిమగ్నమై ఉన్న ఈ సంస్థ.. కొవిడ్ సంక్షోభ సమయంలో దేశానికి అవసరమైన పీపీఈ కిట్లు, వ్యాక్సిన్ల కొనుగోలుకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించింది. ప్రజారోగ్య రంగంలో ప్రతిష్ఠాత్మకమైనదిగా కొనసాగుతున్న ఈ సంస్థలో ప్రభుత్వానికి ఉన్న 100% వాటాను అమ్మేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ చాలాకాలం కిందే బిడ్లను ఆహ్వానించింది.
జనాభా నియంత్రణపై కేంద్రానికి నోటీసులు
విపరీతంగా పెరిగిపోతున్న జనాభాకు అడ్డుకట్టవేసేలా చర్యలు తీసుకోవాలంటూ కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని దండి స్వామి జితేంద్రనాథ్ సరస్వతి దాఖలు చేశారు. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు మానవ వనరులు మన దేశంలో లేవని పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య, ఆహార కొరత విపరీతంగా ఉన్నదని, సరైన వైద్య సదుపాయాలు కూడా లేవని గుర్తుచేశారు.