న్యూఢిల్లీ: రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాద, లౌకిక, సమగ్రత పదాలను చేర్చడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం డిస్మిస్ చేసింది. 1976లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ పదాలను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చింది. మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి, అడ్వకేట్ అశ్విని ఉపాధ్యాయ్, బలరామ్ సింగ్ ఈ పిటిషన్లను దాఖలు చేశారు.
వీటిపై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం ఈ నెల 22న తీర్పును రిజర్వు చేసింది. సోమవారం తీర్పు చెప్తూ, ఈ రిట్ పిటిషన్లపై తదుపరి విచారణ అవసరం లేదని తెలిపింది. పార్లమెంటుకు రాజ్యాంగానికి సవరణ చేసే అధికారం ఉందని, ఆ అధికారం రాజ్యాంగ ప్రవేశికకు కూడా వర్తిస్తుందని వివరించింది. దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) అమలులో ఉన్న కాలంలో పార్లమెంటు ఏం చేసినా చెల్లదనడం సరికాదని స్పష్టం చేసింది.