కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యే పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్జీ ఢోలాకియాకు (59) కేంద్రం పద్మశ్రీ ప్రకటించింది. దీంతో ఆయన కుటుంబీకులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు ఓ ఛాపర్‌ను బహుమతిగా ఇచ్చారు. ఈ విషయం ఆయనకు తెలిసింది.దీంతో దానిని సూరత్‌లోని ఎమర్జెన్సీ సర్వీసుల కోసం ఉపయోగించాలని సూరత్ ప్రజలకే బహుమానంగా ఇచ్చేశారు. దీంతో ఆయన వార్తల్లోకెక్కారు. నా కుటుంబం ఓ ఛాపర్‌ను నాకు బహుమానంగా ఇస్తోందన్న విషయమే నాకు తెలియదు. ఇది నిజంగా ఆశ్చర్యపరిచే బహుమానమే. ఆనందంతో ఛాపర్‌ను బహుమానంగా ఇవ్వడంతో నేను కాదనలేకపోయాను. దీనిని సూరత్ ప్రజల కోసం, ఎమర్జెన్సీ సర్వీసుల కోసం ఉపయోగించాలంటూ దానిని సూరత్ ప్రజలకే బహుమానంగా ఇస్తున్నాను అని సావ్జీ ఢోలాకియా ప్రకటించారు. గుజరాత్ రాష్ట్రానికి వాణిజ్య రాజధాని సూరత్ అని, అయినా సూరత్ ప్రాంతానికి ఓ సొంత ఛాపర్ లేదని ఢోలాకియా అన్నారు. అందుకే సూరత్ ప్రజలకు బహుమానంగా ఇవ్వాలని తాను నిర్ణయం తీసుకున్నానని ఆయన ప్రకటించారు.
గతంలోనూ ఈ వజ్రాల వ్యాపారి ఢోలాకియా వార్తల్లో నిలిచారు. తన దగ్గర పనిచేసే ఉద్యోగులకు 500 కార్లను బహుమానంగా ఇచ్చారు. అంతేకాకుండా 471 ఆభరణాల సెట్లు, 280 ఫ్లాట్లను బహుమానంగా ఇచ్చి, ఉద్యోగుల అభిమానాన్ని చాటుకున్నారు. వీటితో పాటు తన సొంత గ్రామంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో 75 చెరువులను తవ్వించారు.