RahulGandhi | వీర్ సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసుపై పూణేలోని ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు వేదికగా వీర్ సావర్కర్ మనవడు సాత్యకి సావర్కర్ వెల్లడించిన అంశాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన లండన్ పర్యటనలో భాగంగా సావర్కర్‌ను కించపరిచేలా మాట్లాడారని
సావర్కర్ మనువడు సాత్యకి క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం దాఖలు చేయగా.. తాజాగా ఈ కేసు విచారణకు వచ్చింది. అయితే ఈ దావా విచారణ సందర్భంగా ఈ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాహుల్ గాంధీ తరపు న్యాయవాది మిలింద్ పవార్ అడిగిన ప్రశ్నలకు సాత్యకీ సమాధానమిస్తూ, సావర్కర్ అండమాన్ సెల్యులార్ జైలులో ఉన్న కాలంలో బ్రిటిష్ ప్రభుత్వానికి ఐదుసార్లు క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేసిన మాట వాస్తవమేనని సాత్యకి స్పష్టం చేశారు. అయితే, ఆ కాలంలో సావర్కర్ ఒక్కరే కాకుండా మరెందరో రాజకీయ ఖైదీలు అటువంటి విన్నపాలు చేసుకున్నారని, జైలు నుంచి బయటకు వచ్చి దేశం కోసం పని చేయాలనే వ్యూహంతోనే ఆయన అలా చేశారని సాత్యకి వివరించారు.
అలాగే గోవు గురించి సావర్కర్ సిద్ధాంతాన్ని వివరిస్తూ, ఆయన ఆవును ఎన్నడూ దేవుడిగా పూజించలేదని, దానిని కేవలం ఒక ఉపయోగకరమైన జంతువుగా మాత్రమే పరిగణించారని, ఆవు విషయంలో శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండాలని ఆయన నమ్మేవారని సాత్యకి పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయులు బ్రిటిష్ సైన్యంలో చేరాలని సావర్కర్ పిలుపునివ్వడంపై వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. భారతీయ యువతకు సైనిక శిక్షణ, ఆయుధాల వినియోగంపై అనుభవం వస్తే, స్వతంత్రం సిద్ధించిన తర్వాత దేశాన్ని రక్షించుకోవడానికి మనకంటూ సొంత సైన్యం సిద్ధంగా ఉంటుందనే దూరదృష్టితోనే సావర్కర్ ఆ పిలుపునిచ్చారని ఆయన కోర్టుకు వెల్లడించారు. దేశ విభజనకు కారణమైన ద్విజాతి సిద్ధాంతం గురించి ప్రస్తావిస్తూ, ఆ ప్రతిపాదన అసలు సావర్కర్ ది కాదని, దానిని మొదట సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ తెరపైకి తెచ్చారని సాత్యకి వివరణ ఇచ్చారు. భగత్ సింగ్ వంటి ఇతర విప్లవకారులతో సావర్కర్‌ను పోల్చడం సరికాదని, ఎవరిని ఎలా గౌరవించాలనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఆయన పేర్కొన్నారు. ‘భారత రత్న’ పురస్కారం గురించి మాట్లాడుతూ, అది కూడా ప్రభుత్వ పరిధిలోని అంశమేనని, గతంలో నెహ్రూ కుటుంబానికి చెందిన ముగ్గురికి ఆ పురస్కారం లభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కేసులో సాత్యకి సావర్కర్ క్రాస్ ఎగ్జామినేషన్ జూన్ 1వ తేదీన కూడా కొనసాగనుంది.