న్యూఢిల్లీ: ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమంలో 600 మందికి పైగా రైతులు చనిపోయినా కూడా కేంద్రప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడంపై మేఘాలయ గవర్నర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒక కుక్క చనిపోతే సంతాపం ప్రకటించడానికి ఢిల్లీ నాయకులకు సమయం ఉంటుంది కానీ.. వందలాది మంది రైతుల ప్రాణాలు పోతున్నా పట్టింపు ఉండదు’ అని ఆవేదన చెందారు. దేశంలో ఇంతకుముందెన్నడూ ఇంత భారీ స్థాయిలో ఉద్యమం జరుగలేదని పేర్కొన్నారు. తాను రైతుల నిరసనల గురించి మాట్లాడినప్పుడల్లా అది వివాదాస్పదమవుతున్నదని, దీంతో ఢిల్లీ నుంచి ఫోన్ వస్తుందేమో అని ఆలోచించాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. చట్టాలపై ప్రధాని మోదీతో కూడా మాట్లాడినట్టు తెలిపారు. ‘కేంద్రంలో అధికారం ఇప్పుడు ఒకరిద్దరి చేతుల్లో ఉన్నది. వారి కాళ్లు ఇప్పుడు నేలపై లేవు. గర్వం నెత్తికెక్కింది. కానీ రావణుడు కూడా తన తప్పు తెలుసుకొన్నాడు. వీళ్లు కూడా అర్థం చేసుకొంటారు. ఢిల్లీ సరిహద్దులో రైతులు తాము అనుకొన్నది సాధించుకొనే వెళ్తారు’ అని ఆశాభావం ప్రకటించారు. కేంద్రప్రభుత్వం తీరుపై ఇంత అసహనం ఉన్నప్పుడు గవర్నర్ పదవికి రాజీనామా చేయవచ్చు కదా.. అంటూ సామాజిక మాధ్యమాల్లో అడిగిన ప్రశ్నలపై మాలిక్ స్పందించారు. దిగిపొమ్మంటే వెంటనే పదవికి రాజీనామా చేసానని బదులిచ్చారు.