తిరువనంతపురం: తన రంగు, లింగ వివక్షపై సమాజంలో తాను ఎదుర్కొన్న అవమానాల గురించి ఐఏఎస్ అధికారి, కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శారదా మురళీధరన్ చెప్పిన మాటలు సామాజిక మాధ్యమంలో చర్చకు దారితీశాయి. తన భర్త స్థానంలోనే అదే పదవిలో బాధ్యతలు చేపట్టిన తనకు తన భర్త రంగుతో పోలుస్తూ పలువురు కామెంట్లు పెట్టారని ఆమె తెలిపారు. దీనిపై భావోద్వేగంతో స్పందిస్తూ ఆమె ఫేస్బుక్ పోస్ట్ పెట్టారు. ‘నా రంగు గురించి నేనేదో సిగ్గుపడాలి అన్నట్టు పోస్టులు పెట్టారు.
నలుపును ఎందుకు అవమానించాలి. అది విశ్వమంతా ఉంది. అది లేనిదెక్కడ’ అని ఆమె ప్రశ్నించారు. నాలుగేండ్ల వయసులో జరిగిన ఒక సంఘటనను ఆమె గుర్తుకు తెచ్చుకున్నారు. ‘అమ్మా నన్ను తిరిగి గర్భంలోకి ప్రవేశపెట్టి తెల్లగా, అందంగా తీసుకరాగలవా?’ అని తన తల్లిని ప్రశ్నించినట్టు చెప్పారు. ‘ఈ నల్లని మేని ఛాయ వల్ల నేను ఎందుకూ పనికి రాని దానన్నే ఆత్మన్యూనతతోనే పెరిగాను. అయితే నా పిల్లల సహాయంతో దాని నుంచి బయటపడ్డా’ అని తెలిపారు. సమాజం తన వైఖరులను మార్చుకుని, ఈ పక్షపాతం నుంచి బయటపడాల్సిన అవసరం ఉందని అన్నారు.