ముంబై: ఉద్దవ్ ఠాక్రేకు చెందిన శివసేన పార్టీ ఎంపీ అరవింద్ సావంత్.. షిండే వర్గానికి చెందిన శివసేన నేత షైనా ఎన్సీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇంపోర్టెడ్ మాల్ అంటూ ఆయన విమర్శించారు. ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలను శివసేన నేత సంజయ్ రౌత్(Sanjay Raut) సమర్ధించారు. తమ పార్టీ ఎంపీని ఆయన డిఫెండ్ చేసుకున్నారు. తమ నేత ఎవరినీ అవమానించలేదని, అరవింద్ సావంత్ తమ సీనియర్ ఎంపీ అని, ముంబాదేవి స్థానానికి చెందిన బీజేపీ నేత షైనా ఎన్సీ బయటి వ్యక్తి అని, ఆమె ముమ్మాటికీ ఇంపోర్టెడ్ మాల్ అని రౌత్ అన్నారు.
ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యల్లో.. మహిళలను అవమానించినట్లు లేదని ఆయన అన్నారు. సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ గురించి మీరెటువంటి వ్యాఖ్యలు చేశారో గుర్తు లేదా అని రౌత్ విమర్శించారు. బయిటి వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేస్తే, వాళ్లు బయటి నుంచి వచ్చారనే చెబుతామన్నారు. దీంట్లో పెద్ద రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఎంపీ అరవింద్ సావంత్ చేసిన వ్యాఖ్యలను షైనా ఎన్సీ ఖండించారు. మాల్‌ను కాదు.. మహిళను అంటూ ఆమె పేర్కొన్నారు. సెక్షన్ 79, సెక్షన్ 356(2) కింద ముంబై పోలీసులు కేసు బుక్ చేశారు.