న్యూఢిల్లీ : ఉప్పు వాడకంపై అవగాహన ద్వారా గుండె, మూత్రపిండాల వ్యాధులపై పోరాటంలో సత్ఫలితాలు సాధించవచ్చు. అందుకే రెస్టారెంట్ల మెనూలలో సాల్ట్ వార్నింగ్ లేబుల్స్‌ను జత చేయాలి. దీనివల్ల ప్రజలు అధిక ఉప్పు ఉండే ఆహారాన్ని తినడం వల్ల జరగబోయే హానిని అర్థం చేసుకుని, తమ ఆరోగ్యానికి క్షేమకరమైన దానిని ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్రిటన్‌లోని లివర్‌పూల్ విశ్వవిద్యాలయ పరిశోధక బృందం నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
సాల్ట్ వార్నింగ్ గురించి తెలుసుకున్నవారు, దాని గురించి తెలియనివారు ఆర్డర్ ఇచ్చే తీరును ఈ అధ్యయనంలో పరిశీలించారు. సాల్ట్ వార్నింగ్ లేబుల్‌ను చూసినవారు అధిక ఉప్పు ఉండే పదార్థాలను ఆర్డర్ చేయడంలో వెనుకంజ వేసినట్లు తెలిసింది. ఈ లేబుల్స్ వల్ల ఆర్డర్ ఇచ్చే సమయంలో సాల్ట్ కంటెంట్ గురించి ప్రజలకు గొప్ప అవగాహన కలుగుతున్నట్లు, ఆర్డర్ చేసే ఉప్పు మోతాదు తగ్గినట్లు వెల్లడైంది.