న్యూఢిల్లీ : దేశంలో పనిసంస్కృతి మారాలని, యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి సూచించిన విషయం తెలిసిందే. నారాయణమూర్తి చేసిన సూచనకు జిందాల్ స్టీల్ కంపెనీ చైర్మెన్ సజ్జన్ జిందాల్(Sajjan Jindal) మద్దతు పలికారు. నారాయణమూర్తి స్టేట్మెంట్ను మనస్పూర్తిగా ఆమోదిస్తున్నానని, ఎక్కువ సమయం కష్టపడడం కాదు, ఎక్కువ అంకితభావంతో కూడా పనిచేయాలని జిందాల్ అన్నారు. భారత్‌ను ఆర్థిక శక్తిగా మార్చాలని, 2047 నాటికి మన దేశం సూపర్ పవర్ కావాలన్నారు. సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో జిందాల్ తన మద్దతును ప్రకటించారు. మన లాంటి దేశానికి వారానికి అయిదు రోజుల పని సంస్కృతి కరెక్టు కాదు అని జిందాల్ తెలిపారు.
I whole heartedly endorse Mr. Narayana Murthy’s statement. It’s not about burnout, it’s about dedication. We have to make India an economic superpower that we can all be proud of. #India2047
— Sajjan Jindal (@sajjanjindal) October 27, 2023
జాతి నిర్మాణం, సాంకేతికత, ఇన్ఫోసిస్ కంపెనీతోపాటు అనేక విషయాలపై ఇటీవల నారాయణమూర్తి తన అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్‌లో పని ఉత్పాదకత ప్రపంచంలోనే అతి తక్కువ అని చెప్పారు. చైనా వంటి దేశాలతో పోటీ పడాలంటే దేశ యువత తమ పని గంటలను పెంచాలని, రెండో ప్రపంచ యుద్ధం తరువాత జపాన్, జర్మనీలు అలాగే చేశాయని తెలిపారు. భారత్‌లో పని ఉత్పాదకత తగ్గడానికి ప్రభుత్వంలో అవినీతి, అధికారుల అలసత్వం కూడా కారణమని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. ఇది పోనంతవరకు అగ్రరాజ్యాలతో పోటీపడలేమన్నారు.