న్యూఢిల్లీ, ఆగస్టు 26: టిబెట్‌లోని గిరోంగ్ పట్టణంలో భారీ ఆకస్మిక వరద సంభవించినపుడు తన కైలాస యాత్ర బృందాలలో ఒకదానికి చెందిన 77 మంది యాత్రికులు అక్కడి ఇమిగ్రేషన్ కేంద్రంలో ఉన్నారని ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీవాసుదేవ్ బుధవారం తెలిపారు. డాక్టర్ అఖిలేశ్వర్ నేతృత్వంలో కైలాస యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న ఆ బృందం ఇమిగ్రేషన్ కార్యాలయం వద్ద ఆగి ఉన్న సమయంలో ఈ వరద ముంచెత్తి ఆ భవనాన్ని, పట్టణంలోని అనేక ప్రాంతాలను ముంచెత్తినట్టు ఆయన తెలిపారు.
అక్కడ చిక్కుకున్న యాత్రికుల ఆచూకీకి సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం లేదని ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. కైలాస యాత్రలో పాల్గొన్న 21 బృందాలకు చెందిన యాత్రికుల వివరాలను తెలియచేస్తూ 495 మంది ఇప్పటికే సురక్షితంగా తిరిగి వచ్చారని సద్గురు తెలిపారు.