ఝలావర్: రాహుల్ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర రాజస్థాన్‌లో ప్రవేశించడానికి కొన్ని గంటల ముందు రాజస్థాన్ రెండు కాంగ్రెస్ వర్గాల మధ్య పోస్టర్ వార్ మొదలైంది. రాహుల్‌గాంధీకి స్వాగతం పలుకుతూ సచిన్ పైలట్ వేయించిన పోస్టర్లపైనే రాజస్థాన్ పీసీసీ చీఫ్ తన పేరుతో ముద్రించిన పోస్టర్లను వేశారు. ఝలావర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రాజస్థాన్ పీసీసీ చీఫ్ తీరుకు వ్యతిరేకంగా సచిన్ పైలట్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. పోస్టర్ల కోసం తాము ఎంతో ఖర్చుపెట్టి కీలక ప్రాంతాల్లోని హోర్డింగులను అద్దెకు తీసుకున్నామని, ఇప్పుడు తమ పోస్టర్లపై ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా పీసీసీ చీఫ్ పోస్టర్లు వేయడం ఏంటని పైలట్ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు.
రాజస్థాన్‌లో చాలాకాలం నుంచి ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య వార్ నడుస్తోంది. సచిన్ పైలట్ సీఎం కాకుండా అడ్డుకోవడం కోసం గెహ్లాట్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు అయ్యే అవకాశాన్ని కూడా వదులుకున్నారు. ఇద్దరు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ క్రమంలో రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర రాజస్థాన్‌లో ప్రవేశించే సమయం దగ్గరపడటంతో హైకమాండ్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గత నెల 29న కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ రాజస్థాన్‌కు వెళ్లి గెహ్లాట్, సచిన్ మధ్య సయోధ్య కుదిర్చారు. ఇద్దరు నేతలతో కరచాలనం చేయించి రాష్ట్రంలో కాంగ్రెస్ ఐక్యంగా ఉందని చెప్పించారు.
అయినా, రాహుల్‌గాంధీ రాకకు కొన్ని గంటల ముందు రాజస్థాన్ కాంగ్రెస్‌లో మళ్లీ లుకలుకలు బయటపడటం గమనార్హం. గెహ్లాట్ కాకుండా పీసీసీ చీఫ్ ఇప్పుడు సచిన్ పైలట్‌తో గిల్లీకజ్జాలు ఆడటం గమనార్హం. కాగా, రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర ఇవాళ సాయంత్రం రాజస్థాన్‌లో ప్రవేశించనుంది.