మంగళవారం 26 జనవరి 2021
National - Dec 20, 2020 , 18:20:59

నిత్యం 5 వేల మందికి శబరిమల దర్శనం..

నిత్యం 5 వేల మందికి శబరిమల దర్శనం..

తిరువనంతపురం : నిత్యం 5వేల మంది భక్తులను శబరిమల దర్శనానికి అనుమతించనున్నట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) తెలిపింది. డిసెంబర్‌ 26 తరువాత నుంచి ఆర్టీ-పీసీఆర్‌ కొవిడ్‌-19 నెగిటివ్‌ రిపోర్ట్‌ సమర్పించిన వారిని మాత్రమే దర్శనానికి అనుమతించనున్నట్లు పేర్కొంది. కేరళ హైకోర్టు సైతం ఆదివారం నుంచి నిత్యం 5 వేల మందిని దర్శనానికి అనుమతించాలని దేవస్థానం బోర్డును ఆదేశించింది. దర్శనానికి 48 గంటల ముందు ఆర్టీ-పీసీఆర్‌ పరీక్ష చేయించుకొని కొవిడ్‌-19 నెగిటివ్‌ రిపోర్ట్‌ సమర్పించిన వారికి మాత్రమే దర్శన భాగ్యం ఉంటుందని టీడీబీ అధ్యక్షుడు ఎన్‌ వాసు తెలిపారు.

మకరవిలక్కు (మకరజ్యోతి) పండుగ సీజన్‌ సందర్భంగా డిసెంబర్‌ 31 నుంచి జనవరి 19 వరకు ఆలయానికి వచ్చే భక్తులు విధిగా ఆర్టీ-పీసీఆర్‌ నెగటివ్‌ రిపోర్ట్‌ సమర్పించాలని, లేకుంటే కొండ ఎక్కేందుకు అనుమతించబోమని ఆయన పేర్కొన్నారు.  ఇటీవల పుణ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు కేవలం యాంటిజెన్‌ నెగటివ్‌ రిపోర్టు ఉంటే సరిపోతుందని దేవస్థానం బోర్డు పేర్కొంది. శబరిమలలో భక్తుల సౌకర్యార్థం వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేసింది. ఆలయానికి వచ్చే భక్తులకు అన్నివసతులు కల్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు నిత్యం 2 వేల మందిని, వారాంతాల్లో 3 వేల మందిని దర్శనానికి అనుమతిస్తున్నారు.   


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo