Chabahar Port Deal : చాబహార్ పోర్టు ఒప్పందాన్ని (Chabahar Port Deal) సంకుచిత దృష్టితో చూడవద్దని అమెరికాకు భారత్ హితవు పలికింది. ఇరాన్‌తో వాణిజ్య ఒప్పందాలు చేసుకునే దేశాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని మంగళవారం అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్ చేసిన వ్యాఖ్యలపై ఇవాళ భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు.
జై శంరక్ రాసిన ‘వై భారత్ మ్యాటర్స్ (Why Bharat Matters)’ పుస్తకం బంగ్లా వెర్షన్ విడుదల సందర్భంగా విలేకరులు అమెరికా ఆంక్షలపై ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పారు. ‘వాషింగ్టన్ గతంలో ఇలా చేయలేదు. చాబహార్ విషయంలో అమెరికా వైఖరే చూడండి.. ఆ పోర్టును విస్తృత కోణంలో చూస్తే సరైనదే అని పేర్కొంది. చాలాకాలం నుంచి పోర్టుపై పనిచేస్తున్నాం. కానీ ఎప్పుడూ సుదీర్ఘకాలం ఒప్పందం చేసుకోలేదు. దీనికి ఇరాన్ వైపు సమస్యలు, జాయింట్ వెంచెర్ భాగస్వామి మార్పులు, నిబంధనలు ఇలా చాలా సమస్యలున్నాయి. వాస్తవానికి దీర్ఘకాలిక ఒప్పందంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఎట్టకేలకు సమస్యలు పరిష్కరించుకొని డీల్‌పై సంతకాలు చేశాం. ఇది లేకపోతే రేవు నిర్వహణ కష్టమైపోతుంది. అంతిమంగా చాబహార్ వల్ల ఈ ప్రాంతం మొత్తానికి ప్రయోజనం లభిస్తుంది’ అని జైశంకర్ అన్నారు.
మంగళవారం అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ చాబహార్ పోర్టు డీల్ అంశాన్ని ప్రస్తావించారు. ‘చాబహార్ ఓడరేవు నిర్వహణ కోసం భారత్, ఇరాన్ ఒప్పందం చేసుకున్నాయని మాకు తెలిసింది. టెహ్రాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు, దేశ విదేశాంగ విధాన లక్ష్యాలపై న్యూఢిల్లీ సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. అయితే ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. ఇరాన్‌పై అమెరికా కొన్ని ఆంక్షలు విధించింది. వాటి అమలు కొనసాగుతూనే ఉంటుంది. ఏ సంస్థ అయినా, దేశమైనా టెహ్రాన్‌తో వ్యాపార లావాదేవీలు జరిపితే.. వారు కూడా వాటి పరిధిలోకి వస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ విషయాన్ని మేం ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేశాం’ అని వేదాంత్ పటేల్ వ్యాఖ్యానించారు.
చాబహార్ పోర్టు ఇండియా-ఇరాన్ ఫ్లాగ్షిప్ ప్రాజెక్టు. అఫ్గానిస్థాన్, మధ్య ఆసియా ప్రాంతాలను భారత్‌తో అనుసంధానించేందుకు ఇది ముఖ్య మార్గం. ఈ పోర్టు అభివృద్ధి, నిర్వహణలో భారత్‌దే కీలక పాత్ర. ఇప్పటికే న్యూఢిల్లీ ఈ ప్రాజెక్టులో భారీగా పెట్టుబడులు పెట్టింది.