RSS Mohan Bhagwat | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, దాని సిద్ధాంత కర్త ఆర్ఎస్ఎస్కి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఆర్ఎస్ఎస్ మీద బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఆర్ఎస్ఎస్పై జేపీ నడ్డా ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం’ అని పేర్కొన్నారు. ‘ప్రతి దేశ పౌరుడికి భావ ప్రకటనాస్వేచ్ఛ ఉంది. నడ్డా వ్యాఖ్యలు.. బీజేపీ, ఆర్ఎస్ఎస్తో అనుసంధానం కావాల్సిన అవసరం లేదు’ అని గోరఖ్ పూర్ లో జరిగిన ఆర్ఎస్ఎస్ శిక్షణా శిబిర సమావేశంలో మోహన్ భగవత్ చెప్పారు.
ఇటీవల బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘దేశంలో పార్టీ సంస్థాగతంగా శరవేగంగా పెరుగుతున్నది. కీలక దశకు చేరుకున్నది. ఇక ఆర్ఎస్ఎస్ అవసరం బీజేపీకి లేదు. బీజేపీ నాయకత్వం అన్ని అంశాలను స్వతంత్రంగా పరిష్కరించుకోగలుగుతుంది’ అని వ్యాఖ్యానించారు. బీజేపీపై ఆర్ఎస్ఎస్ ప్రభావాన్ని పరోక్షంగా జేపీ నడ్డా ప్రశ్నించారు.