ముంబై: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్త రూ.1,500లు పంపాడు. కోర్టు విధించిన జరిమానాను ఈ మేరకు మనీ ఆర్డర్ ద్వారా చెల్లించినట్లు తెలిపాడు. మహారాష్ట్రలోని భివండికి చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేశ్ కుంటే, రాహుల్ గాంధీపై స్థానిక కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ హత్య చేసిందని 2014 మార్చిలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఈ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ బాంబే హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టును రాహుల్ గాంధీ ఆశ్రయించారు. ఫలితం లేకపోవడంతో న్యాయ పోరాటం చేస్తున్నారు.
కాగా, ఈ నెల 21న రాహుల్ గాంధీ తరుఫు న్యాయవాది నారాయణ్ అయ్యర్ ట్రయల్ కోర్టులో విచారణకు హాజరయ్యారు. అయితే పరువునష్టం దావా వేసిన రాజేశ్ కుంటే, విచారణ వాయిదా వేయాలని కోర్టును కోరారు. దీనిపై రాహుల్ తరుఫు న్యాయవాది నారాయణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫిర్యాదుదారుడు గతంలో కూడా వాయిదా కోరడంతో కోర్టు రూ.500 జరిమానా విధించిన సంగతిని గుర్తు చేశారు. అది ఇంకా చెల్లించలేదని చెప్పారు.
దీంతో రెండోసారి వాయిదా కోరిన పిటిషనర్ రాజేశ్‌కు కోర్టు వెయ్యి జరిమానా విధించింది. పాత జరిమానాతో కలిపి మొత్తం రూ.1,500 రాహుల్ గాంధీకి చెల్లించాలని ఆదేశించింది. దీంతో రూ.1,500ను మనీ ఆర్డర్ ద్వారా ఢిల్లీలోని రాహుల్ గాంధీ కార్యాలయానికి పంపినట్లు రాజేశ్ తరుఫు న్యాయవాది గణేష్ ధరల్కర్ శుక్రవారం తెలిపారు.
మరోవైపు ఫిర్యాదుదారుడు రాజేశ్ కుంటే పంపిన రూ.1,500 మనీ ఆర్డర్ అందుకున్నట్లు రాహుల్ గాంధీ కార్యాలయం నుంచి తనకు ఫోన్ వచ్చిందని న్యాయవాది నారాయణ్ అయ్యర్ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు కేసు విచారణ రోజువారీగా కొనసాగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. తదుపరి విచారణ అయిన మే 10 నాటికి సాక్ష్యాలు, సాక్షుల వివరాలను సమర్పించాలని భివండి కోర్టు ఫిర్యాదుదారుడిని ఆదేశించిందన్నారు.