DK Shivakumar | పంజాబ్‌కు చెందిన పీసీసీ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ చేసిన వ్యాఖ్యలపై కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోమవారం స్పందించారు. ముఖ్యమంత్రి పదవి కోసం రూ.500 కోట్లు ఇవ్వాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై డీకే స్పందిస్తూ ‘ఆమెను మంచి మానసిక ఆసుపత్రిలో చేర్చాలి’ అన్నారు. డీకే శివకుమార్ సోమవారం కర్నాటక గవర్నర్ గులాబ్ చంద్ కటారియాను కలిశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేశారా? అని ప్రశ్నించగా.. అందులో ఏమాత్రం నిజం లేదన్నారు. రూ.500 కోట్ల సూట్‌కేస్ ఇచ్చినవారు మాత్రమే సీఎం అవుతారనడంలో అర్థం లేదన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలల్లో నిజం లేదన్నారు.
2027 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తనను పంజాబ్‌లో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే తన భర్త తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి వస్తాడని నవజ్యోత్ కౌర్ పేర్కొన్నారు. పంజాబ్‌ను బంగారు రాష్ట్రంగా తీర్చిదిద్దగలరని ఆమె శాభావం వ్యక్తం చేశారు. తాము ఎల్లప్పుడూ పంజాబ్ గురించే మాట్లాడుతామన్నారు. కానీ, ముఖ్యమంత్రి పదవిలో కూర్చునేందుకు తమ వద్ద రూ.500కోట్లు లేవు అన్నారు. పంజాబ్ కాంగ్రెస్‌లో ఐదుగురు నేతలు సీఎం పదవిని ఆశిస్తున్నారని.. వారంతా సిద్ధూను ముందుకు రానివ్వడం లేదని ఆమె విమర్శించారు. ఆమె వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఆ తర్వాత ఆమె స్పందిస్తూ తన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఎవరి నుంచి ఏమీ ఆశించలేదంటూ చెప్పుకొచ్చారు.