Maharashtra Farmer : ఓ రైతు రూ.1 లక్ష అప్పు తీసుకుంటే అది వడ్డీతో కలిపి రూ.74 లక్షలకు చేరింది. దాంతో ఆ రైతు తన భూమి (Land) ని, ట్రాక్టర్ (Tractor) ను, ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను అమ్మాడు. అయినా ఇంకా అప్పు మిగిలిపోవడంతో కిడ్నీ (Kidney) అమ్మి కట్టాడు. మహారాష్ట్ర (Maharastra) లోని చంద్రపూర్ (Chandrapur) జిల్లాకు చెందిన రోషన్ సదాశివ్ (Roshan Sadashiv) అనే రైతు ఈ దుర్బర పరిస్థితిని ఎదుర్కొన్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. రోషన్ సదాశివ్ వ్యవసాయంలో వరుసగా నష్టాలు రావడంతో డెయిరీ ఫామ్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ.1 లక్ష అప్పు తీసుకున్నాడు. అధిక వడ్డీలకు తీసుకున్న ఆ అప్పులకు వడ్డీలు చెల్లించడం కోసం మళ్లీ అప్పులు చేశాడు. అలా ఆ అప్పులు మొత్తం రూ.74 లక్షలకు చేరాయి. అప్పుల వాళ్ల నుంచి ఒత్తిళ్లు పెరిగాయి.
దాంతో సదాశివ్ తన వ్యవసాయ భూమిని, ట్రాక్టర్‌ను, ఇంట్లోని విలువైన వస్తువులను అమ్మి అప్పులు చెల్లించాడు. అయినా ఇంకా అప్పులు మిగిలే ఉండటంతో రుణదాత బలవంతంగా అతడిని కాంబోడియాకు తీసుకెళ్లి రూ.8 లక్షలకు తన కిడ్నీని అమ్మించి, తన అప్పు తీర్చుకున్నాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితుడు గోడు వెల్లబోసుకున్నాడు.
తనకు న్యాయం చేయకపోతే మహారాష్ట్ర రాజధాని ముంబైలోని మంత్రాలయలో ఉన్న స్టేట్ హెడ్‌క్వార్టర్స్ ముందు కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని చెబుతున్నాడు.