Road accident : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని ఆ కుటుంబం రంజాన్ (Ramadan) సంబురాలు చేసుకుంటోంది. కుటుంబ సభ్యులు, పిల్లలతో ఇళ్లంతా సందడిగా ఉంది. కానీ కొన్ని గంటల్లోనే ఆ ఆనందం ఆవిరైంది. మైనర్ కారు డ్రైవింగ్ ఆ ఇంట్లో విషాదాన్ని నింపింది. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి కారు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని పహర్‌గంజ్ ఏరియాకు చెందిన ముస్లిం కుటుంబం రంజాన్ సంబురాల్లో ఉంది. వారి రెండేళ్ల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటోంది. అంతకుముందే వారి పొరుగింటి వ్యక్తి పంకజ్ అగర్వాల్ 15 ఏళ్ల కుమారుడు తండ్రి కారును తీసుకుని బయటికి వెళ్లాడు. తిరిగి వస్తూ ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికపై పైనుంచి కారు పోనిచ్చాడు. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
దాంతో అప్పటిదాకా సంబురంగా ఉన్న కుటుంబంలో ఏడుపులు మొదలయ్యాయి. ఆనందంగా గడిపిన కుటుంబంలో విషాదం అలుముకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్లక్ష్యంగా కారు నడిపినందుకు బాలుడి తండ్రి పంకజ్ అగర్వాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఘటన మైనర్లకు వాహనం ఇవ్వకుండా కఠిన చట్టం చేయాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేసింది.