పాట్నా: రాష్ట్రీయ జనతా దళ్ నేత తేజస్వి యాదవ్(Tejashwi Yadav) ఇవాళ మీడియాతో మాట్లాడారు. మహాఘట్‌బంధన కూటమి గురించి ఆయన ఏమీ ప్రస్తావించలేదు. నామినేషన్ల ఫైలింగ్ ముగిసిందని, ప్రచారం మొదలుపెట్టాలన్నారు. బీహారీ ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారని, ప్రస్తుత డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయినట్లు పేర్కొన్నారు. నిరుద్యోగం, వలసలతో బీహారీలు బాధపడుతున్నట్లు తెలిపారు. ఎన్నికల ఎజెండాను ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రకటించారు. జీవికా దీదీల నెలవారి జీతాన్ని 30 వేలు చేయనున్నట్లు చెప్పారు.
మహాఘట్బంధన్ ప్రభుత్వం ఏర్పడగానే జీవికా దీదీలను పర్మనెంట్ ఉద్యోగులుగా ప్రకటించనున్నట్లు చెప్పారు. అంగన్వాడీల జీతాలను 30 వేలకు పెంచడం చిన్న విషయం కాదన్నారు. ఇదో ఎన్నో ఏళ్ల డిమాండ్ అని తెలిపారు. జీవికా దీదీలకు అదనపు అలవెన్స్ రెండు వేలతో పాటు ఆ క్యాడర్‌కు 5 లక్షల బీమా కల్పించనున్నట్లు చెప్పారు. సీట్ల పంపకం విషయంలో మహాఘట్బంధన్లో ఎటువంటి విబేధాలు లేవని, గురువారం అన్ని సమాధానాలు దొరుకుతాయని తేజస్వి యాదవ్ అన్నారు.