న్యూఢిల్లీ: పర్యావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులో వడగాడ్పులు మరింత తరచుగా సంభవిస్తాయని, వేడి సంబంధిత మరణాలు పెరిగే అవకాశం ఉన్నదని తాజా అధ్యయనం వెల్లడించింది. గత 20 ఏండ్లుగా ప్రాణాంతకమైన వడగాడ్పుల ప్రమాదం పెరిగిందని పేర్కొన్నది. ఈ మేరకు అధ్యయన వివరాలు నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. వడగాడ్పుల ప్రభావం యూరప్‌పై అధికంగా ఉంటుందని, వడగాడ్పులు అనేవి రాబోవు రోజుల్లో సాధారణం అవుతాయని స్విట్జర్లాండ్‌కు చెందిన ఈటీహెచ్ జ్యూరిచ్ పరిశోధకులు పేర్కొన్నారు. వీరు 2013 నుంచి ప్రపంచవ్యాప్తంగా 47 దేశాల్లోని 748 నగరాల నుంచి ఉష్ణోగ్రతల డాటాను సేకరించారు.