కర్ణాటక కాంగ్రెస్ ఫిరాయింపు రాగం అందుకున్నది. సీఎం, డిప్యూటీసీఎం వర్గాలుగా చీలిన నేతలు.. ఫిరాయింపుల పాట పాడుతున్నారు. బీజేపీలోకి మీరు వెళ్లిపోతారంటే.. లేదు మీరే వెళ్లిపోతారంటూ పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు.
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్లోఅంతర్గత విభేదాలు మరోమారు భగ్గుమన్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వర్గీయుల మధ్య మాటల తూటాలు మళ్లీ పేలుతున్నాయి. సిద్ధరామయ్య మద్దతుదారుడైన సీనియర్ ఎమ్మెల్యే కేఎన్ రాజన్నను మంత్రివర్గం నుంచి తొలగించడం ఇద్దరు అగ్రనేతల మద్దతుదారుల మధ్య చిచ్చు రేపింది. డీకే శివకుమార్‌పై రాజన్న మద్దతుదారులు విరుచుకుపడుతున్నారు. రాజన్నను మంత్రి పదవి నుంచి తొలగించడం వెనక డీకే పన్నాగం ఉందని ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ ఆరోపణలను బహిరంగంగా ప్రశ్నించిన తర్వాత రాజన్న మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురవడం వివాదానికి కారణమైంది. తాజాగా డీకేకు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్యే హెచ్‌సీ బాలకృష్ణ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ, రాజన్న కుమారుడు అయిన రాజేంద్ర మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరడంతో పార్టీలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. తాజాగా రాజేంద్ర మాట్లాడుతూ సెప్టెంబర్ విప్లవం గురించి మాట్లాడుతున్న వారంతా చివరికి బీజేపీలో చేరుతారని వ్యాఖ్యానించారు.
రాజన్నను నిందిస్తున్న వారంతా బీజేపీలోకి వెళ్తారని, అది చూసి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఎమ్మెల్యే బసనగౌడపాటిల్ యత్నాల్ 20-25 మంది ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకొస్తామని చెప్తున్నారని, అదే జరిగితే సెప్టెంబర్ విప్లవం గురించి చెప్పిన మాటలు నిజమవుతాయని అన్నారు. సెప్టెంబర్‌లో ఏం కావాలనుకుంటే అది చేసుకోవచ్చని, అవసరమైతే బ్రెయిన్ మ్యాపింగ్ కూడా చేయించుకోవచ్చని, ఇప్పటికే కొంతమంది పార్టీ నుంచి ఒక కాలు బయట పెట్టారని డీకేను ఉద్దేశించి అన్నారు. అలాగే రాజన్న అసెంబ్లీలో ఆరెస్సెస్ గీతం పాడలేదని, ఆరెస్సెస్ క్యాంపునకు వెళ్లేందుకు షార్ట్ ధరించలేదని పరోక్షంగా డీకేకి చురకలంటించారు.
రాజేంద్ర వ్యాఖ్యలపై బాలకృష్ణ దీటుగా బదులిచ్చారు. రాజన్న మంత్రిగా ఉన్నప్పుడు ప్రవర్తించిన తీరు, నడవడిక, భాషే ఆయనను నాశనం చేశాయని విమర్శించారు. ‘మాట ఒక కుటుంబాన్ని నాశనం చేస్తుంది, ఒక రంధ్రం పొయ్యిని పాడు చేస్తుంది’ అనే సామెత ఆయనకు సరిపోతుందని ఎద్దేవా చేశారు. ఆయన ఇప్పటికే బీజేపీకి దరఖాస్తు చేసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను అప్రతిష్ఠపాలు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని, రాజన్న ప్రకటనపై అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.