న్యూఢిల్లీ: అదానీ-హిండెన్‌బర్గ్ వివాదానికి సంబంధించిన కేసులో క్లీన్చిట్ ఇస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలైంది. అదానీ గ్రూప్ స్టాక్‌ల ధరల పెంపులో మోసానికి పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై ప్రత్యేక సంస్థ లేదా సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు దానిని తిరస్కరిస్తూ జనవరి 3న తీర్పు చెప్పింది. అదానీపై ఆరోపణలకు సంబంధించి 24 అంశాలపై మాత్రమే విచారణ జరిపినట్టు సెబీ తన దర్యాప్తు నివేదికలో పేర్కొందని, అయితే ఆ దర్యాప్తు పూర్తయ్యిందా, లేదా, తాము కనుగొన్న విషయాలేంటన్నది తన నివేదికలో పేర్కొనలేదని పిటిషనర్ పేర్కొన్నారు.