న్యూఢిల్లీ : సల్వాజడుం రద్దు కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పును వక్రీకరించి మాట్లాడటం సరికాదని, కేంద్ర హోంమంత్రి (Union Home minister) అమిత్ షా (Amit Shah) సుప్రీం తీర్పును తప్పుగా అర్థం చేసుకుంటున్నారని సుప్రీంకోర్టు, హైకోర్టులకు చెందిన ప్రముఖ విశ్రాంత న్యాయమూర్తులు అన్నారు. ఈ మేరకు అమిత్ షా వ్యాఖ్యలను ఒక ప్రకటనలో ఖండించారు.
అమిత్ షా వ్యాఖ్యలను ఖండించిన వారిలో జస్టిస్ సంజీవ్ బెనర్జి, జస్టిస్ అంజనా ప్రకాష్, జస్టిస్ అభయ్ ఒకా, జస్టిస్ కైలాష్ గంభీర్, జస్టిస్ మదన్, జస్టిస్ జేసీ, జస్టిస్ కురియన్, జస్టిస్ విక్రమ్, జస్టిస్ ఏకే పట్నాయక్, జస్టిస్ గోపాల్ గౌడ, జస్టిస్ మురళీధర్, జస్టిస్ గోవింద్ మథుర్, జస్టిస్ చంద్రు, జస్టిస్ గోపాల్ రెడ్డి, జస్టిస్ కన్నన్, జస్టిస్ చంద్రకుమార్, జస్టిస్ మోహన్ గోపాల్, జస్టిస్ సీహెచ్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ రఘురామ్ ఉన్నారు.
సల్వాజుడుం కేసు తీర్పులో నక్సలిజాన్ని గానీ, దాని భావజాలాన్నిగానీ ఎక్కడా సమర్ధించినట్లు పేర్కొనలేదని విశ్రాంత న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి తరపున ప్రచారం కోసం అమిత్ షా అటువంటి వ్యాఖ్యలు చేయడం సహేతుకం కాదని తప్పుబట్టారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు గౌరవప్రదంగా, భావజాల కేంద్రీకృతంగా జరగాల్సిన ఎన్నికలని తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు వ్యక్తుల మధ్య జరగవని, అయినప్పటికీ అత్యున్నత పదవిలో ఉన్న హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు దేశ న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు.
ఇది సుప్రీంకోర్టు న్యాయమూర్తులపైనా ప్రభావం చూపనుందని వారు ఆందోళన వ్యక్తంచేశారు. ఇకనైనా ఉపరాష్ట్రపతి ఎన్నికను గౌరవప్రదంగా భావించాలని, వ్యక్తిగత దూషణలు, పేరుపెట్టి అవమానించడం వంటి అసభ్య రాజకీయాలకు చోటు ఉండకూడదనీ రిటైర్డ్ జడ్జెస్ అమిత్ షాకు హితవు పలికారు.