చండీగఢ్, జనవరి 8: రూ.20 ఎంఆర్పీ ఉన్న వాటర్ బాటిల్‌కు రూ.55 వసూలు చేసిన ఒక హోటల్‌కు చండీగఢ్ రాష్ట్ర వినియోగదారుల హక్కుల పరిరక్షణ కమిషన్ మొట్టికాయలు వేసి ఫిర్యాదుదారుకు రూ.3 వేల పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది. ప్రీ ప్యాక్డ్ ఉత్పత్తులైన మినరల్, ప్యాకేజ్డ్ వాటర్‌పై గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్పీ)ని మించి ఎట్టి పరిస్థితుల్లో చార్జీ వసూలు చేయరాదని, ఆ ఉత్పత్తి ట్యాక్స్‌లు, ప్యాకేజింగ్ ధర, రిటైలర్ మార్జిన్ అన్నీ ఎంఆర్పీలోనే ఇమిడి ఉంటాయని స్పష్టం చేసింది.
ఖన్నా అనే మహిళ 2023, డిసెంబర్ 12న చండీగఢ్‌లో ఒక రెస్టారెంట్‌కు డిన్నర్‌కు వెళ్లారు. ఆమె మొత్తం బిల్లు రూ.1,922 అయ్యింది. అందులో సీజీఎస్టీ, యూటీజీఎస్టీతో పాటు ఒక వాటర్ బాటిల్‌కు రూ.55 చార్జి చేయడాన్ని గమనించింది. వాటర్ బాటిల్ ధర రూ.20 ఉండగా, రూ.55 వసూలు చేయడమేమిటని ఆమె ప్రశ్నించినా రెస్టారెంట్ వారు పట్టించుకోలేదు. దీనిపై ఆమె జిల్లా వినియోగదారుల కమిషన్‌కు వెళ్లగా, ఆమెకు అక్కడ చుక్కెదురైంది. దీంతో ఆమె చండీగఢ్ రాష్ట్ర వినియోగదారుల ఫోరంను ఆశ్రయించగా, గత నెలలో ఆమెకు అనుకూలంగా తీర్పు చెప్పారు.